జల్సాలకు అలవాటుపడ్డ ఈ కుర్రాడు కుటుంబాన్నే...?     2018-10-12   19:28:25  IST  Sai M

తన జల్సాలకు అడ్డువస్తున్నారనే ఒకే ఒక కారణంతో తనను కన్న తల్లితండ్రులను.. సోదరిని చంపి కటకటాలపాలయ్యాడు ఓ విద్యార్థి. కుటుంబసభ్యులను చంపి తెలివిగా తప్పించుకోవాలని చూసాడు కానీ అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన చూస్తుంటే కుటుంబ ఆప్యాయతలు ఏమయిపోతున్నాయి అనే సందేహం కలగక మానదు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు పరిశీలిస్తే…

ఇంటీరియర్‌ డిజైనర్‌ గా వ్యాపారం చేసుకునే మిథిలేశ్‌ భార్యా పిల్లలతో కలిసి దక్షిణ ఢిల్లీలో ఉంటున్నాడు. అతనికి ఓ కుమారుడు, ఓ కూతురు ఉన్నారు. కుమారుడు సర్నమ్ వర్మ (19 ) గురుగ్రామ్‌లోని ఓ కాలేజీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. జల్సాలకు అలవాటు పడ్డ వర్మ చదువును నిర్లక్ష్యం చేసి నిత్యం కంప్యూటర్ గేమ్స్ ఆడేవాడు. స్నేహితులతో కలిసి జల్సాగా తిరిగేవాడు . కంప్యూటర్ గేమ్స్ బోలెడంతా డబ్బు ఖర్చు పెట్టేవాడు. దీంతో తల్లిదండ్రులు స్నేహితులతో తిరగొద్దని హెచ్చరించారు. రెండు మూడు సార్లు తండ్రి… వర్మను కొట్టాడు. ఫ్రెండ్స్ ను ఇంటికి రాకుండా చేశారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులపై కోపం పెంచుకున్న వర్మ.. వారిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

బుధవారం ఉదయం తెల్లవారు జామున వర్మ.. బెడ్‌రూంలో నిద్రిస్తున్న తల్లిదండ్రులు, చెల్లెలిపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్యచేశాడు. తర్వాత కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు. ఇరుగుపొరుగు వారిని పిలిచిన వర్మ తన తల్లిదండ్రులు, చెల్లెల్ని దొంగలు చంపేశారని చెప్పాడు. అనుమానం రాకుండా తనని తాను కత్తితో గాయపరచుకున్నాడు. అయితే వర్మ ప్రవర్తనతో అనుమానం కలిగిన పోలీసులు అతడిని పోలీసు స్టేషనుకు పిలిపించారు. తమదైన శైలిలో విచారిస్తే నిజం చెప్పాడు. తన జల్సాలు, కంప్యూటర్ గేమ్స్ కు అడ్డువస్తున్నారని ముగ్గురిని చంపినట్లు అంగీకరించాడు వర్మ.