చెన్నైలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది.నీళ్లలో కరెంట్ కొట్టి ఓ పిల్లాడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే, తన ప్రాణాలకు తెగించి ఓ యువకుడు అతన్ని కాపాడాడు.
ఈ హృదయవిదారక దృశ్యం చూస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే.ఈ ఘటన ఏప్రిల్ 16, బుధవారం నాడు చెన్నైలోని అరుంబాక్కం ప్రాంతం, ముత్తుమారి అమ్మన్ కోయిల్ వీధిలో జరిగింది.
అక్కడ నిలిచిపోయిన వర్షపు నీరు ప్రాణాంతకంగా మారింది.
విద్యుత్ షాక్‌కు గురైన ఆ పిల్లాడి పేరు జాడెన్ ర్యాన్ (Jaden Ryan).9 ఏళ్ల జాడెన్ 3వ తరగతి చదువుతున్నాడు.స్కూల్‌కి వెళ్తున్న క్రమంలో భారీ వర్షాలతో నిండిన వీధిలో నడుస్తున్నాడు.
ఎవరికీ తెలియకుండా భూగర్భంలో ఉన్న ఓ విద్యుత్ వైరు తెగిపోయి ఆ నీళ్లలోకి కరెంట్ సరఫరా అవుతోంది.జాడెన్ ఆ నీళ్లలో కాలు పెట్టగానే కరెంట్ షాక్ తగిలింది.
దాంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

సమీపంలోని సీసీటీవీ కెమెరాలో ఈ మొత్తం దృశ్యం రికార్డైంది.పిల్లాడు పడిపోవడం చుట్టుపక్కల వాళ్లు చాలా మంది చూశారు.కానీ నీళ్లలో కరెంట్ ఉందేమోననే భయంతో ఎవరూ సహాయం చేయడానికి ముందుకు రాలేదు.
సరిగ్గా అప్పుడే బైక్‌పై వస్తున్న కన్నన్ తమిళసెల్వన్ (Kannan Thamizhselvan) అనే యువకుడు నీళ్లలో కదలకుండా పడి ఉన్న ఆ పిల్లాడిని గమనించాడు.మొదట జారిపడ్డాడనుకున్నాడు.దగ్గరికి వెళ్లి చూస్తే అసలు విషయం అర్థమైంది.
కన్నన్ ఆ పిల్లాడిని ముట్టుకోవడానికి ప్రయత్నించాడు.
అతనికి కూడా కొద్దిగా కరెంట్ షాక్ తగిలింది.అయినా ధైర్యం కోల్పోకుండా మళ్లీ ప్రయత్నించి ఎలాగోలా ఆ పిల్లాడిని నీళ్లలో నుంచి బయటకు లాగేశాడు.
ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అక్కడే పిల్లాడికి సీపీఆర్ (CPR) చేశాడు.వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాడు.
కన్నన్ అద్భుతమైన సత్వర స్పందనతో ఆ పిల్లాడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు.

ఇంతటి సాహసం చేసిన కన్నన్ పుదుక్కోటాయి జిల్లా, కలియరన్విడుతికి చెందినవాడు.అతను డిప్లొమా ఇంజనీర్.ప్రస్తుతం అరుంబాక్కంలోనే కన్‌స్ట్రక్షన్ మెటీరియల్స్ సరఫరా చేసే ఓ సంస్థలో పని చేస్తున్నాడు.
చుట్టూ అంత మంది భయపడినా మీరు మాత్రం ప్రాణాలకు తెగించి ఎలా వెళ్లారు? అని కన్నన్‌ని అడిగితే, “మనం ఎంతకాలం బ్రతుకుతామో ఎవరికీ తెలీదు.బ్రతికి ఉన్నంత కాలం తోటివారికి సాయం చేయాలి” అని చెప్పాడు.
అతని మాటల్లో ఎంతో మానవత్వం కనిపించింది.
ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
కన్నన్ చూపించిన ధైర్యం, మానవత్వంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.అందరూ కన్నన్‌ని నిజమైన హీరో అంటూ కొనియాడుతున్నారు.







