సూర్యాపేట జిల్లా: మోతె మండల పరిధిలోని సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై వ్యర్థ పదార్థాలు పోయాడంతో రహదారి మొత్తం కంపు కొడుతూ దుర్గంధం వెదజల్లుతుంది.రోడ్డు పొడవునా వ్యర్ధాలు పడేసి పోవడంతో స్థానిక ప్రజలు వాహనదారులు ముక్కు మూసుకొని వెళ్లాల్సిన దుస్తితి ఏర్పడిందని వాపోతున్నారు.
ఎక్కడి నుండో లారీ,డిసీఎంలలో కుళ్లిన,నెత్తురోడుతున్న చికెన్ వ్యర్థ పదార్థాలను తెచ్చి,గంటల తరబడి రోడ్డు పక్కన వాహనాలు పార్కింగ్ చేసినట్లు వెయిట్ చేస్తూ అదును చూసి ఈ ప్రాంతంలో రహదారి వెంట పడబోసి వెళుతున్నారు.దీనితో ఈ వ్యర్ధాల నుండి వెలువడే విష వాయువు పీల్చి స్థానికులు, వాహనదారులు, ప్రయాణికులు అనారోగ్యం బారినపడే పరిస్థితి నెలకొంది.
ప్రతి రోజు పదుల సంఖ్యలో వాహనాలు రోడ్ల పక్కన ఆపేసి కుళ్ళిపోయిన చికెన్ వ్యర్ధ రసాయనాలను విడిచి వెళుతున్నారని, పొలాల్లో పని చేసే వారు, ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రహదారి వెంట వ్యవసాయ పనులు చేస్తున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జాతీయ రహదారిపై ఇంత పెద్ద మొత్తంలో వ్యర్ధాలను వదిలి ప్రజల,ప్రయాణికుల వాహనదారులు జీవితాలతో చెలగాటం ఆడుతున్న వారిపై చర్యలు తీసుకునే వారే లేరా అని వాపోతున్నారు.
వ్యర్థాలతో తట్టుకోలేకపోతున్నామని బానోతు సుహాసిని అనే మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రతీరోజు రెండు మూడు లారీలు మా పొలం పక్కనే రక్తపు వ్యర్దాన్ని పడబోసి పోతున్నారు.గంటల కొద్దీ సమయం ఇక్కడే లారీలు ఆపుతున్నారు.ఈ దుర్వాసనను తట్టుకోలేక పోతున్నాం.ఎవరికి చెప్పాలో అర్ధం కావడం లేదని అంటున్నారు.ఇదిలా ఉంటే ఇటీవలే ఒక డ్రైవర్ పై కేసు నమోదు చేశామని మోతె ఎస్ఐ చెబుతున్నారు.
స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఇటీవల రోడ్డు పక్కన వ్యర్ధాలను పడబోస్తున్న ఏపి7టిఎఫ్ 6660 నెంబర్ గల డిసిఎం వాహనాన్ని దొరకబట్టి డ్రైవర్ పై కేసు నమోదు చేశాం.ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు.