మనలో చాలా మంది కూటి కోసం కోటి విద్యలు అనే సామెత వినే ఉంటారు.డబ్బు సంపాదించడం కోసం కొంతమంది మంచి, చెడులను పక్కనపెట్టి అడ్డదారుల్లో సంపాదించడమే వృత్తిగా ఎంచుకుంటున్నారు.
ఈ కోవలోనే ఓ వ్యక్తి బీమా డబ్బులు( Insurance Money ) పొందేందుకు ఓ సరికొత్త ప్లాన్ వేశాడు.అతని కుటుంబం అంతా కలిసి ఓ బిచ్చగాడిని హత్య చేసి, అతని చనిపోయాడని నమ్మించి ఏకంగా రూ.80 లక్షల బీమా డబ్బులు పొందారు.అందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.ఉత్తరప్రదేశ్ లోని( Uttar Pradesh ) గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని భట్టా పర్సౌల్ గ్రామంలో నివసించే అనిల్ సింగ్ చౌదరీ( Anil Singh Chowdary ) అనే వ్యక్తి కష్టపడకుండా డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు.2004లో రూ.80 లక్షల యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ ను అనిల్ సింగ్ చౌదరీ తీసుకున్నాడు.ఆ తరువాత ఒక సొంత కారు కొని తాను చనిపోయినట్లు అందరినీ నమ్మించి ఆ బీమా డబ్బులు పొందేందుకు తన తండ్రి, సోదరులతో కలిసి ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు.
ప్లాన్ లో భాగంగా 2006 జూలై 13న రైలులో అడుక్కునే బిచ్చగాడిని( Beggar ) ఆహారం ఇప్పిస్తామని తమతో పాటు ఆగ్రా సమీపంలో ఉండే హోటల్ కి తీసుకెళ్లి మత్తుమందు కలిపిన ఆహారం తినిపించారు.
ఆ బిచ్చగాడు అపస్మారక స్థితిలోకి వెళ్లాక కారులో ఎక్కించి ఓ విద్యుత్ స్తంభానికి కారుతో ఢీ కొట్టారు.అనంతరం ఆ బిచ్చగాడిని డ్రైవర్ సీటులో కూర్చోబెట్టి, కారుకు నిప్పు పెట్టారు.
ఆ తర్వాత విద్యుత్ స్తంభానికి ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగి కారు కాలిపోయినట్లు అందర్నీ నమ్మించారు.స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా కారు నెంబర్ ఆధారంగా అనిల్ సింగ్ చౌదరీ తండ్రి విజయ్ పాల్ సింగ్( Vijaypal Singh ) పోలీసులు సంప్రదించారు.ఇక కుటుంబం అంతా కలిసి తమ కుమారుడు చనిపోయాడని కన్నీరు మున్నీరుగా విలపించి సొంత ఊరికి తీసుకువచ్చి మృతదేహానికి అంతక్రియలు నిర్వహించారు.ఆ తర్వాత రూ.80 లక్షల బీమా సొమ్ము వచ్చాక కుటుంబ సభ్యులు వాటాలు వేసుకుని పంచుకున్నారు.
ఇక అప్పటినుంచి అనిల్ అహ్మదాబాదులో ఉంటూ తన పేరు రాజ్ కుమార్ చౌదరీగా మార్చుకున్నాడు.ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటివి పొందాడు.బ్యాంకు లోన్ తీసుకొని ఒక ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు.
అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని భావించిన అనిల్ సింగ్ బతికే ఉన్నాడని సమాచారం అందింది.నికోల్ ప్రాంతంలో నివసిస్తున్న అనిల్ ను పోలీసులు అరెస్టు చేసి, తమదైన శైలిలో విచారించగా బీమా డబ్బుల కోసం తండ్రితో కలిసి బిచ్చగాడిని హత్య చేసి, తాను చనిపోయినట్లు నమ్మించానని ఒప్పుకున్నాడు.