మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరబోతున్నట్లుగా గత కొద్ది రోజులుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.ఆయన బిజెపి కీలక నాయకుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో కొద్దిరోజుల క్రితమే భేటీ కావడంతో ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది.
వాస్తవంగా చాలా కాలంగా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటు, అనేక సందర్భాల్లో బిజెపి పై ప్రశంసలు కురిపించారు.అప్పట్లోనే ఆయన పార్టీ మారుతారని ప్రచారం జరిగినా, రాజగోపాల్ రెడ్డి సైలెంట్ గానే ఉండిపోయారు.
పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతున్న ఆయనపై కాంగ్రెస్ అధిష్టానం కాని, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గాని చర్యలు తీసుకోకపోవడంతో ఆయన విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు మౌనంగా ఉందనేది అందరికీ అనుమానంగానే ఉంటూ వచ్చింది.
రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయాలనే కండిషన్ విధించడం తో, ఆయన ఎటు తేల్చుకోలేకపోతున్నారు.
ఈ నేపథ్యంలోనే మునుగోడు నియోజకవర్గంలోని కీలక నాయకులు, తన ప్రధాన అనుచరులతో ఈరోజు రాజగోపాల్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు.మునుగోడు నియోజకవర్గంలో ఉన్న మర్రిగూడెం చుండూరు మండల చండూరు మండల నాయకులను ఆయన హైదరాబాద్ కు రావాల్సిందిగా కోరారు.
ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు మర్రిగూడెం మండలం నాయకులతోనూ, సాయంత్రం నాలుగు గంటలకు చండూరు నాయకులతోనూ రాజగోపాల్ రెడ్డి సమావేశం కాబోతున్నారు.
ఈ భేటీ ముగిసిన అనంతరం రాజగోపాల్ రెడ్డి పార్టీ మారాలా వద్ద అనే విషయంలో ఒక క్లారిటీకి రాబోతున్నారు.ఇ ప్పటికీ కాంగ్రెస్ పై అనే సందర్భాల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తూ, బిజెపిని పొగడడం తదితరు పరిణామాలతో ఇక రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో కొనసాగరని బిజెపిలో చేరుతారు అనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది.ఈ రోజు జరగబోయే ముఖ్య అనుచరుల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్న తర్వాత , రాజగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.