విశాఖ జిల్లా రాజకీయాలు మంచి కాక రేపుతున్నాయి.2019 ఎన్నికల్లో విశాఖ సిటీలోని నాలుగు అసెంబ్లీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకోగా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీకి చెక్ పెట్టాలని వైసీపీ భావిస్తోంది.ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు విశాఖ పర్యటనలో సీఎం జగన్ ఎక్కువగా మహిళా ప్రజాప్రతినిధులతోనే మంతనాలు జరిపారు.విశాఖ తూర్పు నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థిని కూడా ఖరారు చేసేశారు.
ఆమె ఎవరో కాదు అక్కరమాని విజయనిర్మల.
విశాఖ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ సీటు కోసం చాలా మంది పోటీ పడుతున్నారు.
వంశీకృష్ణ యాదవ్, హరివెంకటకుమారి సహా పలువురు ఎమ్మెల్యే టిక్కెట్ ఆశావహుల్లో ఉన్నారు.గతంలో జరిగిన మేయర్ ఎన్నికల్లో హరి వెంకటకుమారి విజయం సాధించగా ప్రస్తుతం వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు.దీంతో సీఎం జగన్ మరోసారి విజయనిర్మలకే బెర్త్ ఖరారు చేశారు.2019 ఎన్నికల్లో చివరి నిమిషంలో విశాఖ తూర్పు అభ్యర్థిగా విజయనిర్మలను వైసీపీ నిలబెట్టగా పరాజయం పాలయ్యారు.

అయితే ఈసారి గెలుపు కోసమే కృషి చేయాలని విజయనిర్మలకు సీఎం జగన్ అభయహస్తం ఇచ్చినట్లు తెలుస్తోంది.ఈ మేరకు విశాఖ పర్యటనలో ఆమెపై సీఎం జగన్ వరాల జల్లు కురిపించారు.విశాఖకు అవసరంగా మారిని మూడో ఫ్లై ఓవర్‌ను సీఎం విశాఖ తూర్పు నియోజకవర్గానికి మంజూరు చేశారు.అలాగే విశాఖ తూర్పులో అండర్ డ్రైనేజీకి రూ.25 కోట్లు కేటాయించారు.జోడుగుళ్ళపాలెంలో మత్య్సకారులకు షెడ్ల నిర్మాణానికి నిధులు కూడా కేటాయిస్తానని చెప్పారు.
ఇలా సీఎం జగన్ తన నియోజకవర్గానికి నిధుల వరద పారించడంతో విజయనిర్మల ఆనందానికి అవధులు లేవు.విజయనిర్మల ఎమ్మెల్యేగా గెలవకపోయినా ప్రస్తుతం నియోజకవర్గ పార్టీ ఇంఛార్జిగా ఉంటూనే వీఎంఆర్డీఏ ఛైర్‌పర్సన్‌గా హడావిడి చేస్తున్నారు.
సీఎం జగన్ తనకు ఇచ్చిన వరాలతో వచ్చే ఎన్నికల్లో ప్రచారంలోకి దిగవచ్చని విజయనిర్మల భావిస్తున్నారు.ఇప్పుడు అనధికారికంగా ఆమెకు టిక్కెట్ ఖరారు కావడంతో మిగిలిన ఆశావహులు పోటీ నుంచి తప్పుకోకతప్పదు.
మరోవైపు విశాఖ తూర్పు నుంచి వచ్చే ఎన్నికల్లో వెలగపూడి రామకృష్ణబాబు బరిలోకి దిగుతారా లేదా వేరేవాళ్లకు టీడీపీ అధిష్టానం టిక్కెట్ కేటాయిస్తుందా అన్న విషయం ఆసక్తికరంగా మారింది.







