ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ నింపిన విషాదాలు అన్ని ఇన్నీ కావు.కోట్లాదిమందిని బాధితులుగా చేసి, లక్షలాది మంది ప్రాణాలు తీసిన కరోనా మహమ్మారి దెబ్బకు ఆర్ధిక పరిస్ధితి అతలాకుతలమైంది.
వ్యాపారాలు కుదేలవ్వడంతో ఎంతోమంది దిక్కుతోచని పరిస్ధితుల్లో పడిపోయారు.ఈ నేపథ్యంలో ఆయా దేశ ప్రభుత్వాలు తిరిగి వాణిజ్యాన్ని గాడిలో పెట్టేందుకు గాను ఆర్ధిక ప్యాకేజీలను ప్రకటిస్తున్నాయి.
వీటి ద్వారా రుణాలు అందజేసి .వ్యాపారులు నిలబడేందుకు సాయం చేస్తున్నాయి.అయితే కొందరు అక్రమార్కుల కారణంగా ఈ పథకం దుర్వినియోగం అవుతోంది.తాజాగా కోవిడ్ రుణాలను దొడ్దిడారిన కొట్టేయడంతో పాటు హెల్త్‌కేర్ మోసానికి పాల్పడిన భారత సంతతికి చెందిన వైద్యుడికి అమెరికా కోర్టు 96 నెలల జైలు శిక్ష విధించింది.
న్యూయార్క్‌లో స్థిరపడిన నేత్ర వైద్య నిపుణుడు అమిత్ గోయల్.అప్‌కోడ్ ప్రోసిజర్ కింద మిలియన్ డాలర్ల మేరకు తప్పుడు బిల్లింగ్ చేయడంతో పాటు చిన్న వ్యాపారాలకు సాయం చేసేందుకు ఉద్దేశించిన రెండు ప్రభుత్వ హామీ రుణాలను మోసపూరితంగా పొందాడు.
ఈ నేరానికి గాను ఈ నెలలోనే జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.గోయల్ గతేడాది సెప్టెంబర్‌లో యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి సీబెల్ ముందు ఆరు కౌంట్ల నేరాలను అంగీకరించాడు.
ఈ నేరాలకు జైలు శిక్షతో పాటు ఐదేళ్ల పర్యవేక్షణతో కూడిన విడుదలను విధించింది కోర్ట్.అలాగే 3.6 మిలియన్ల ఆస్తుల జప్తుతో పాటు మరో 3.6 మిలియన్లను ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశించింది.దీనికి సంబంధించి 1.79 మిలియన్ డాలర్లను గోయల్ చెల్లించాడు.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం.గోయల్ దురాశతో తప్పుడు ఆరోపణలతో రోగులను, బీమా కంపెనీలను 3.6 మిలియన్ల మేర మోసం చేశాడు.అంతేకాదు.
ఇతర వైద్యులను కూడా ఈ స్కీమ్‌లో చేరాల్సిందిగా ఒత్తిడి చేశాడు.లేనిపక్షంలో వారి జీవనోపాధి, వృత్తిని దెబ్బతీసి ప్రతీకారం తీర్చుకుంటానని వారిని హెచ్చరించాడు.
ఈ విధంగా కోవిడ్ ప్రారంభ రోజులలో పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ నుంచి 6,37,200 డాలర్లను అమిత్ గోయల్ దొంగిలించినట్లు న్యాయశాఖ పేర్కొంది.