పీఆర్సీ సాధన విషయంలో ఉద్యోగులు తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లుగా వ్యవహరిస్తుండగా , ప్రభుత్వం సైతం అంతే స్థాయిలో మొండి పట్టుదలకు వెళ్తోంది.ఉద్యోగులు అనవసర ఆందోళన చెందుతున్నారని , కొత్త పే స్లిప్పులు చూసుకుంటే వారి జీతం పెరిగింది లేనిది అర్థమవుతుందని ఏపీ ప్రభుత్వం చెబుతున్నా, ఉద్యోగులు మాత్రం తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు.
ఈ క్రమంలో నేడు చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగులు తలపెట్ట గా దీనిని అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం గట్టిగానే ప్రయత్నాలు చేసింది.ఈ సభకు వెళ్లే వారిని ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పాటు, ముందస్తుగానే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఈరోజు చలో విజయవాడ కార్యక్రమం సక్సెస్ అయిందనే చెప్పాలి.భారీ ఎత్తున ఉద్యోగులు తరలిరావడంతో జగన్ సైతం ఆశ్చర్యపోయారట.ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే అని, పోలీసులు సరిగా వ్యవహరించి ఉంటే ఉద్యోగుల సభ సక్సెస్ అయ్యేది కాదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.వాస్తవంగా చలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగస్తులు 15 రోజుల కిందటే ప్రకటించారు.
అయినా పోలీసులు కానీ , ఇంటెలిజెన్స్ కానీ ఈ విషయాన్ని తక్కువ అంచనా వేశాయి.తీరా ఇప్పుడు చూస్తే భారీ సంఖ్యలో ఉద్యోగులు విజయవాడ చేరుకున్నారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, జగన్ వంటి వారి పైన తీవ్ర విమర్శలు చేయడం వంటి వ్యవహారాలపై జగన్ సీరియస్ గా ఉన్నారట.పూర్తిగా ఇది పోలీస్, ఇంటెలిజెన్స్ వర్గాల వైఫల్యం గానే జరిగినట్లుగా జగన్ ఒక అభిప్రాయానికి వచ్చారు.
దీంతో పోలీస్ అధికారులలో ఆందోళన మొదలైందట.
ఇక చలో విజయవాడకు భారీ ఎత్తున ఉద్యోగులు హాజరైన క్రమంలో వారిపై పోలీసులు ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దు అని, శాంతియుతంగానే వారిని ఈ కార్యక్రమాన్ని చేసుకోనివ్వాలి అని, ఎట్టిపరిస్థితుల్లోనూ లాఠీచార్జి వంటివి చేయవద్దని జగన్ సీరియస్ గానే ఆదేశాలు జారీ చేశారట.ఒకవేళ పోలీసులు ఉద్యోగులను చెదరగొట్టే క్రమంలో ఏవైనా అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటే ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశం ఉందనే జగన్ ఈ చర్యలు చేపట్టినట్లు కనిపిస్తున్నారు.