అమెరికాలో పాకిస్తాన్ రాయబారిగా మసూద్‌ఖాన్‌ను నియమిస్తూ ఇమ్రాన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.ఉగ్రవాద సంస్థలతో ఆయనకు సంబంధాలున్నాయంటూ ఆరోపణలు రావడంతో అగ్రరాజ్యం మసూద్ నియామకాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది.
ఇటీవల అమెరికా కాంగ్రెస్ సభ్యుడు స్కాట్ పెర్రీ పాకిస్తాన్ రాయబారి గురించి అధ్యక్షుడు జో బైడెన్‌కు లేఖ రాశారు.అమెరికాలో పాకిస్తాన్ రాయబారిగా మసూద్ ఖాన్ పేరును తిరస్కరించాలని పెర్రీ ఈ లేఖలో బైడెన్‌ను కోరారు.
దక్షిణాసియా ప్రాంతంలో అమెరికా ప్రయోజనాలను, మన మిత్రదేశం భారత్ భద్రతను మసూద్‌ఖాన్ దెబ్బతీస్తున్నారని పెర్రీ పేర్కొన్నారు.ఈ నేపథ్యంలోనే మసూద్‌ఖాన్ నియామకాన్ని అమెరికా తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లుగా కథనాలు వస్తున్నాయి.
తాజాగా మసూద్‌ఖాన్‌ను రాయబారిగా తిరస్కరించాలని భారతీయ అమెరికన్ల బృందం జో బైడెన్‌కు విజ్ఞప్తి చేసింది.మసూద్‌ను ఉగ్రవాద గ్రూపుల సానుభూతిపరుడిగా ఈ బృందం పేర్కొంది.లేడీ అల్‌ఖైదా అఫియా సిద్ధిఖీ, ఉగ్రవాద గ్రూపులు హిజ్బుల్ ముజాహిదీన్, హర్కత్ ఉల్ ముజాహిదీన్, జమాతే ఇస్లామీ పట్ల మసూద్ సానుకూల వైఖరి ప్రదర్శించినట్లు ఆరోపించింది.మసూద్ ఖాన్ను పాకిస్తాన్ దౌత్యవేత్తగా నియమించడం వల్ల టెర్రరిస్టు సంస్థలు అమెరికన్ ఇన్‌స్టిట్యూట్‌లలోకి ప్రవేశం పొందే ప్రమాదం ఉంటుందని భారత బృందం అభిప్రాయపడింది.
దీని వల్ల అఫ్గానిస్థాన్పై అమెరికా వైఖరి పైనా ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించింది.మరి భారత విజ్ఞప్తిపై జో బైడెన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.
పాకిస్తాన్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
గతేడాది ఆగస్టు వరకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) అధ్యక్షుడిగా మసూద్ ఖాన్ వ్యవహరించారు.అంతకుముందు ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ శాశ్వత ప్రతినిధిగా, చైనాలో పాక్ రాయబారిగా ఆయన పనిచేశారు.2008లో భారత వాణిజ్య రాజధాని ముంబైపై ఉగ్రదాడికి పాల్పడిన లష్కరే తొయిబా పార్ట్‌నర్ హెల్పింగ్ హ్యాండ్ ఫర్ రిలీఫ్ అండ్ డెవలప్‌మెంట్ సంస్థకు మసూద్ ఖాన్ అండగా వున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి.