తెలంగాణలోని హుజూరాబాద్ నియోజకవర్గం లో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి.ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారనేది సాయంత్రానికి తేలిపోనుంది.
టిఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి మాజీ మంత్రి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ తో పాటు మొత్తం 30 మంది అభ్యర్థులు హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేశారు.అయితే ప్రధాన పోటీ అంతా బిజెపి టిఆర్ఎస్ అభ్యర్థుల మధ్య నెలకొంది.
ఈ రెండు పార్టీలకు ఎన్నికల ఫలితం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.ఇదిలా ఉంటే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కు అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తిచేశారు.
ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయ్యింది.ఓట్ల లెక్కింపు ను ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ కళాశాలలో కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నారు.
దీంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈవీఎం , స్ట్రాంగ్ రూమ్ ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.
కౌంటింగ్ జరిగే ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో పెట్టారు.ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించబోతున్నారు.
ఆ తరువాత ఈవీఎంలలో నమోదైన ఓట్లను లెక్కిస్తారు.
మొత్తం 306 పోలింగ్ స్టేషన్ల కు సంబంధించిన 306 ఈవీఎంలలో ఓట్లను లెక్కించబోతున్నారు. ముందుగా హుజురాబాద్ మండలానికి చెందిన పోతిరెడ్డి పేట గ్రామం ఓట్లను లెక్కించగా బోతున్నారు.మొత్తం 14 టేబుళ్ల పై మొత్తం 22 రౌండ్ గా ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
ఒక్కో రౌండ్లో 30 నిమిషాలు సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.హుజూరాబాద్ నియోజకవర్గం లో మొత్తం పోలింగ్ 86.64 శాతం ఓటింగ్ నమోదు అవడం, పోలైన ఓట్లు 2 లక్షలు దాటడం తో ఫలితాలు తేలే సరికి సాయంత్రం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ ఎన్నికల ఫలితాలపై ప్రధాన పార్టీలు టెన్షన్లు ఉన్నాయి ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగానే రాబోయే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఉంటాయి కాబట్టి ఇంతగా టెన్షన్ పడుతున్నాయి.
ఇక ఇక్కడ ఎవరు విజయం సాధిస్తారని విషయంపైన జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి.ఈ ఎన్నికల ఫలితాలపై తెలంగాణలోనే కాకుండా, ఆంధ్ర ప్రాంతంలోనూ బెట్టింగులు జరుగుతున్నట్లు సమాచారం.