నువ్వా నేనా అన్నట్లు గా హుజూరాబాద్ నియోజకవర్గం లో అన్ని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య ఎన్నికల సమరం మొదలైంది.టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి.
అయితే ఇక్కడ ప్రధాన పోటీ అంతా టీఆర్ఎస్, బీజేపీ మధ్య నెలకొంది.బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ పోటీ చేస్తుండటంతో, ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ నియోజకవర్గంలో ఇప్పటికే అనేక పథకాలు ప్రవేశపెట్టింది.
ఇంకా మరెన్నో పథకాలను ప్రవేశపెట్టేందుకు రకరకాల మార్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.టిఆర్ఎస్ అధికారంలో ఉండడం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా అందరూ ఈ ఎన్నికల్లో గెలుపు పైనే దృష్టిసారించడం, ఇలా అనేక కారణాలతో బిజెపి అలెర్ట్ అయింది.
టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే విధంగా చేయాలనే ఆలోచనతో కేంద్ర బిజెపి పెద్దలను రంగంలోకి దించడం ఒకటే మార్గంగా తెలంగాణ బిజెపి అభిప్రాయపడుతోంది.
కేంద్రం ప్రవేశపెట్టిన అనేక పథకాలను టిఆర్ఎస్ తమవిగా చెప్పుకుంటోంది.
దీంతో ఆ పథకాల క్రెడిట్ టిఆర్ఎస్ కు వెళ్లకుండా తమ ఖాతాలో వేసుకోవాలని బిజెపి భావిస్తోంది.అందుకే ఆయా శాఖలకు చెందిన కేంద్ర మంత్రులను రంగంలోకి దించి హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎన్నికల ప్రచారానికి దింపాలి అనే నిర్ణయానికి వచ్చేసింది.
ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో భారీ బహిరంగ సభ నిర్వహించి ఇక్కడ తమ బలం నిరూపించుకోవాలి తెలంగాణ బిజెపి నాయకులు డిసైడ్ అయ్యారు.
పదే పదే టిఆర్ఎస్, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను హైలెట్ చేస్తూ ప్రజల్లో బిజెపిని చులకన చేసే విషయంపై దృష్టి పెట్టడంతో, దాన్ని తిప్పి కొట్టే విధంగా బిజెపి ప్లాన్ చేసుకుంటోంది.ఈ మేరకు ఈ నెల 21వ తేదీ నుంచి బిజెపి నేతలు ప్రచారాన్ని ఉధృతం చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లారు.
కనీసం పది, పన్నెండు మంది కేంద్ర మంత్రులను హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి వచ్చేలా ఆయన ఒప్పుంచే ప్రయత్నం చేస్తున్నారట.