ఎన్ని చట్టాలు వచ్చినా.మహిళలకు వరకట్న వేధింపులు తప్పడం లేదు.
వరకట్నాన్ని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసినప్పటికీ వరకట్న హత్యలు జరుగుతూనే ఉన్నాయి.అత్తింటి వేధింపులు తట్టుకోలేక.
పుట్టింటికి వెళ్లలేక ఎంతోమంది మహిళలు బలవుతున్నారు.ఉద్యోగం చేసే వారైనా.
ఇంట్లో ఉండే వారైనా.వరకట్న వేధింపులకు గురవుతున్నారు.
కానీ దానిని చాలామంది తమ బిడ్డకు బహుమతిగా ఇస్తున్నామంటూ వెనకేసుకొస్తున్నారు.దౌర్భాగ్యమౌన విషయం ఏంటంటే ఎంత వరకట్నం తీసుకుంటే సమాజంలో అంత పలుకుబడి ఉంటుందంటూ ప్రచారం నిర్వహించుకుంటారు కొందరు.
గతవారం కేరళకు చెందిన ఎస్‌వి విస్మయ అనే ఆయుర్వేద వైద్యురాలి అనుమానాస్పద మృతి వ్యవహారం దేశంలో వరకట్నం రక్కసిపై మరోసారి చర్చ జరిగేలా చేసింది.విస్మయ ఆత్మహత్య చేసుకుందని అందరూ అనుకున్నారు.
కానీ ఆ తర్వాత ఆమె తన అన్నకు పంపించిన మెసేజ్‌లు, ఫోటోలు బయటకు రావడంతో అసలు విషయం బయటపడింది.అందులో ఆమె మొహం, చేతులపై గాయాలున్నాయి.
దీంతో తమ కూతురిని భర్త అత్తమామలే చిత్రహింసలు పెట్టి చంపేశారంటూ విస్మయ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
ఈ సంఘటనకు చెలించిపోయిన భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త, మేషం గ్రూప్ అధినేత సోహాన్ రాయ్ మహిళల రక్షణ కోసం కీలక సంస్కరణలు చేపట్టారు.
తన సంస్థలో పనిచేసే ఉద్యోగులు ఎవ్వరూ కట్నం తీసుకోకూడదని.కట్నం ఇవ్వకూడదని ఆదేశాలు జారీ చేశారు.దీనికి సంబంధించి పది పాయింట్లతో కూడిన అగ్రిమెంట్‌ను రూపొందించిన సోహాన్ రాయ్.దీనిపై ఉద్యోగుల సంతకాలు తీసుకుంటున్నారు.
ఎవరైనా హద్దు మీరి కట్నం ఇచ్చినా, తీసుకున్నా కఠినమైన న్యాయ విచారణను ఎదుర్కోవాల్సి వుంటుందని తెలిపారు.అంతేకాదు వరకట్నానికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు గాను ప్రత్యేకమైన సెల్ కూడా ఆయన ఏర్పాటు చేశారు.
సోహన్ రాయ్.షార్జా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎరైజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ వ్యవస్థాపకుడిగా, సీఈవోగా వ్యవహరిస్తున్నారు.
సోహాన్ రాయ్ .ఈ ఏడాది మార్చిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేషం సంస్థలో వరకట్న వ్యతిరేక విధానాన్ని ప్రకటించారు.ఈ వారం దీనిని అమల్లోకి తీసుకొచ్చారు.దీని ప్రకారం .16 దేశాల్లో విస్తరించి వున్న ఎరైజ్ శాఖల్లో పనిచేసే ప్రతి ఒక్క ఉద్యోగి ఈ నిబంధనలను పాటించాల్సి వుంటుంది.ఈ తరహా విధానం ప్రపంచంలోనే తొలిసారి అని సోహాన్ రాయ్ అన్నారు.
కాగా, లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగులకు ఎన్నో సంస్థలు వేతనాల్లో కోత పెట్టిన సంగతి తెలిసిందే.కానీ సోహన్ రాయ్ మాత్రం ఉద్యోగులతోపాటు వారి భార్యలకు కూడా వేతనాలు చెల్లించి తన పెద్దమనసు చాటుకున్నారు.
సోహన్ రాయ్.షార్జాలో మేషం గ్రూప్ సంస్థలను నెలకొల్పి పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగారు.ఫోర్బ్స్ 2017లో విడుదల చేసిన మిడిల్ ఈస్ట్ ఇన్‌ఫ్లూయెన్స్‌డ్ లీడర్ల జాబితాలోనూ ఆయన చోటు దక్కించుకున్నారు.అయితే, ఉద్యోగుల భార్యలకూ జీతాలు ఇవ్వడానికి రాయ్ ఒక కారణం చెబుతున్నారు.
ఓ గృహిణి చేసే పని విలువ ఆమె భర్త కంటే తక్కువ ఏం కాదంటూ ఓ కేసు విచారణ సందర్భంగా భారత సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.కోవిడ్ సంక్షోభ సమయంలో ఉద్యోగులు నిబద్ధతతో పని చేయడానికి వారి జీవిత భాగస్వాములు కూడా కారణం అని రాయ్ బలంగా నమ్ముతున్నారు.
అందుకే వారికి సైతం అండగా నిలవాలని నిర్ణయించారు.