చైనాలోని వుహాన్ నుంచి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి రోజులు గడుస్తున్నా అదుపులోకి రావడం లేదు.ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ లో మంచి ఫలితాలు సాధిస్తున్నా ప్రజలందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే సంవత్సరాల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
అయితే కరోనా మహమ్మారి గురించి ప్రజలను మరింత టెన్షన్ పెట్టే కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
శాస్త్రవేత్తలు మొదట ఒకసారి కరోనా బారిన పడితే శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని మళ్లీ కరోనా సోకదని భావించారు.
అయితే పలు దేశాల్లో రెండోసారి పలువురు కరోనా బారిన పడ్డ కేసులు వెలుగులోకి రావడంతో రెండోసారి కూడా కరోనా బారిన పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.అయితే మూడోసారి కరోనా సోకిన కేసులు సైతం వెలుగులోకి వస్తుండటం గమనార్హం.
ఇటలీలో 101 సంవత్సరాల వయస్సు ఉన్న వృద్ధురాలు మరియా అర్సింఘర్ ఇప్పటికే రెండుసార్లు కరోనా బారిన పడి వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.11 నెలల కాలంలోనే వృద్ధురాలు మూడుసార్లు కరోనా బారిన పడటం గమనార్హం.ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో మరియా మొదటిసారి కరోనా బారిన పడింది.ఆ తరువాత వైరస్ నుంచి కోలుకుని ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయింది.
ఆ తరువాత సెప్టెంబర్ లో మరోసారి కరోనా బారిన పడ్డ మరియా త్వరగానే వైరస్ నుంచి కోలుకుంది.తాజాగా మరోసారి కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా వైరస్ నిర్ధారణ అయింది.
అయితే మరియా వయస్సు పైబడిన వృద్ధురాలు కావడం, కరోనా నుంచి కోలుకున్నా మళ్లీ వైరస్ సోకుతుండటంతో ఆమె కుటుంబ సభ్యులు టెన్షన్ పడుతున్నారు.కరోనా వ్యాక్సిన్ ప్రజలకు త్వరగా అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమవుతుంది.