అన్ని దేశాల్లో నిషేధపు అంచుల్లో ఉండి తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న చైనా సోషల్ మీడియా దిగ్గజం టిక్ టాక్ యాప్ అమెరికా కార్యకలాపాల్ని కొనుగోలు చేయడంపై మైక్రోసాఫ్ట్ కీలక ప్రకటన చేసింది.టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
దీని భద్రతపై వ్యక్తమవుతున్న అనుమానాలపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ఆదివారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు, అమెరికన్ల వ్యక్తిగత సమాచారం తదితర అంశాలపై ట్రంప్ లేవనెత్తిన అంశాలపై సత్య విస్తృతంగా చర్చించినట్లు మైక్రోసాఫ్ట్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
అమెరికాతో పాటు కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లోనూ యాప్ కార్యకలాపాల్ని సొంతం చేసుకునేందుకు యోచిస్తున్నట్లుగా మైక్రోసాఫ్ట్ తెలిపింది.బైట్ డ్యాన్స్‌తో జరుపుతున్న చర్చలు సెప్టెంబర్ 15 నాటికి పూర్తయ్యే అవకాశం వుందని అభిప్రాయపడింది.
అమెరికా అధ్యక్షుడి ఆందోళనల్ని పరిగణనలోనికి తీసుకుంటున్నామని, వాటన్నింటికీ సరైన పరిష్కారం లభించే విధంగా కొనుగోలు ఒప్పందం ఉంటుందని స్పష్టం చేసింది.అమెరికా ఆర్ధిక వ్యవస్థకు సైతం ప్రయోజనాలు అందేలా ఈ ఒప్పందం ఉంటుందని ట్రంప్‌కు హామీ ఇచ్చింది.వాటాల కోసం ఇతర సంస్థలను సైతం ఆహ్వానిస్తామని తెలిపింది.
టిక్‌టాక్ సాయంతో చైనా గూఢచర్యం చేస్తోందనే ఆరోపణల నేపథ్యంలో అమెరికాలో టిక్ టాక్ యాప్‌ను బ్యాన్ చేస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఐతే ఆ యాప్‌ను కొనుగోలు చేయాలని భావిస్తున్న మైక్రోసాఫ్ట్.ఆయన ప్రకటనతో అప్రమత్తమైంది.యాప్ భద్రత విషయంలో ట్రంప్‌కి భరోసా ఇచ్చి, నిషేధం ఆలోచనలను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.కాగా చైనా యాప్స్‌తో దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం వుందని, దీనిపై ఫిర్యాదులు రావడంతో భారత ప్రభుత్వం టిక్ టాక్ సహా 59 చైనీస్ యాప్స్‌ను నిషేధించిన సంగతి తెలిసిందే.