కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం.అండర్ కరెంట్‌గా కాకినాడ కార్పొరేషన్‌ను శాసిస్తున్నారా? తనదైన శైలిలో అధికార పక్షానికి దిమ్మతిరిగేలా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా? తన మాట తీరుతో, తన వర్గం వారిని కట్టడి చేసేందుకు, బాబుకు బుద్ధి చెప్పేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారా? అంటే.ఔననే సమాధానమే వస్తోంది.ప్రస్తుతం కాకినాడ కార్పొరేషన్ ఉప ఎన్నిక తెరమీదకి వచ్చింది.ఇక్కడి 50 వార్డులకు గాను 48 వార్డుల్లో ఎన్నిక మంగళవారం జరగనుంది.దీనికి కైవసం చేసుకునేందుకు అధికార టీడీపీ, విపక్షం వైసీపీలు తీవ్ర స్థాయిలో చర్యలు ముమ్మరం చేశాయి.
ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం కామనైపోయింది.ఇక, ఇప్పుడు ఇదే జిల్లాకు చెందిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కీలకంగా మారనున్నారనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.2014 నాటి కాపు రిజర్వేషన్ హామీని చంద్రబాబు నెరవేర్చలేదనే డిమాండ్‌తో గత కొంత కాలంగా తీవ్రస్థాయిలో ఉద్యమాలు చేస్తున్న ముద్రగడ ఇటీవల పాదయాత్రకు సైతం సిద్ధమయ్యారు.అయితే, పొలిటికల్ ఇది రంగు పులుముకోవడంతో ప్రభుత్వం అనుమతి లేదన్న కారణంతో తిరస్కరించింది.
దీంతో మరింత ఆగ్రహానికి గురైన ముద్రగడ.ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్నారు.
ఈ క్రమంలోనే అందివచ్చిన కార్పొరేషన్ ఎన్నికలను ఆయన తనకు అనుకూలంగా మలుచుకుని, బాబుకు ఎర్త్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు.ఈ క్రమంలోనే ముద్రగడ పరోక్ష ప్రచారం ప్రారంభించేసినట్టు సమాచారం.
కిర్లంపూడిలో ఉన్న ముద్రగడ తన వర్గం కాపు ఓటర్ల జాబితాను తెప్పించుకున్నారు.ఈ జాబితా ప్రకారం వారికి ముద్రగడే స్వయంగా ఫోన్లు చేసి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని చెబుతున్నారని సమాచారం.
కాపులను మోసం చేసిన టీడీపీకి తప్ప ఎవరికి ఓటు వేసినా పరవాలేదని కూడా ఆయన చెబుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
దీంతో ఇప్పుడు కాపు వర్గం స్వయంగా ముద్రగడ ఫోన్ చేస్తుండడంతో తమ నిర్ణయాన్ని సమీక్షించుకునే పనిలో పడ్డాయని సమాచారం.
ఈ పరిణామంతో టీడీపీ ఖంగు తింటోంది.పరిస్థితి ఇలా మారుతుందని ఊహించని మంత్రులు సైతం ముద్రగడ ఎత్తుగడతో నివ్వెర పోతున్నారట! తాము కాపు వర్గానికి ఎంతో చేస్తున్నామని మైకుల్లో మొత్తుకుంటున్నా.
ముద్రగడ ఇలా అండర్ కరెంట్‌గా వ్యవహరించి ఎర్త్ పెట్టడాన్ని వాళ్లు జీర్ణించుకోలేక పోతున్నారని తెలుస్తోంది.అయితే, ముద్రగడ ఫోన్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని మరికొందరు అంటున్నారు.
ఏదేమైనా ఇప్పుడు ముద్రగడ వ్యవహారం ఆసక్తిగా మారింది.