బెజవాడ వైసీపీలో నిప్పు .. అదే జగన్ చేసిన తప్పు   YS Jagan's Mikes Big Problem In Bejawada Constituency     2018-09-19   11:40:48  IST  Sai M

బెజవాడ అంటే రాజకీయానికైనా ..రౌడీయిజానికైనా పెట్టింది పేరు. ఇక్కడ రాజకీయాలు ఎప్పుడూ భగ్గుమంటూనే ఉంటాయి. నాయకుల మధ్య ఆధిపత్యపోరు కూడా ఎక్కువ. దీనికి తోడు గ్రూపు రాజకీయాలు. ఒక పార్టీ అని కాకుండా అన్ని పార్టీల్లోనూ ఇదే తరహా ధోరణి కనిపిస్తూ ఉంటుంది. తాజాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం సీటు విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన చిచ్చు ఆ పార్టీని దహించివేస్తోంది. నగర నేతల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుకు తోడు పార్టీ అధిష్ఠానం వ్యవహరిస్తున్న తీరుతో నగరంలోని మూడు నియోజకవర్గాల్లో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. నియోజకవర్గ ఇన్‌చార్జులుగా రోజుకొకరు తెరపైకి వస్తుండటంతో ఇటు నాయకుల్లో.. అటు కార్యకర్తల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.

సెంట్రల్‌ నియోజకవర్గంలో వంగవీటి రాధాకు చెక్‌ పెట్టేందుకు వెలంపల్లి, పశ్చిమంలో వెలంపల్లికి గండి కొట్టేందుకు రాధా పావులు కదుపుతున్నారనేది అందరికీ తెలిసిందే. సెంట్రల్‌లో మల్లాది విష్ణుకు లైన్‌ క్లియర్‌ చేసేందుకే రాధాను మచిలీపట్నం పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌గా పంపేందుకు రంగం సిద్ధం చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదివారం వైసీపీ వాణిజ్య విభాగం సమావేశంలో జిల్లా పార్టీ ఇన్‌చార్జి పెద్దిరెడ్డి చేసిన ఈ ప్రతిపాదనపై రాధా వర్గం భగ్గుమంది. నగరానికి చెందిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు, రాధా అభిమానులు సోమవారం రంగా విగ్రహం వద్ద బైఠాయించారు. వారిలో ఇద్దరు పెట్రోలు పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. సెంట్రల్‌ నియోజకవర్గం వైసీపీ ఇన్‌చార్జిగా తొలుత గౌతంరెడ్డి ఉండేవారు. ఆ తర్వాత వంగవీటి రాధా తెరపైకి వచ్చారు.

తాజాగా చోటుచేసుకున్న పరిణామాలతో మల్లాది విష్ణు వైపు పార్టీ అధిష్ఠానం మొగ్గుచూపడం ప్రారంభించింది. ఆదివారం నాటి సమావేశంలోనూ పెద్దిరెడ్డి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో రాధా వర్గం భగ్గుమంది. ఈ నేపథ్యంలో రాధా సోదరుడు, ఉయ్యూరు నగర పంచాయతీలో వైసీపీ ఫ్లోర్‌లీడర్‌ అయిన వంగవీటి శ్రీనివాసప్రసాద్‌ పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నగరానికి చెందిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు, అభిమానులు సోమవారం ఉదయం పెద్ద ఎత్తున రాధా కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగారు. అక్కడ ఉన్న వైసీపీ ఫ్లెక్సీలను తొలగించారు. మల్లాది విష్ణుకు సీటు ఇస్తే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామంటూ నినాదాలు చేశారు.

YS Jagan's Mikes Big Problem In Bejawada Constituency-

రాధాను బుజ్జగించేందుకు పార్టీ అధిష్ఠానం గుడివాడ ఎమ్మెల్యే నాని, తూర్పు వైసీపీ నేత యలమంచిలి రవిని రంగంలోకి దింపింది. అయినా రాధా మెత్తబడినట్టు కనిపించలేదు. ఈ వ్యవహారంలో జగన్ తనకు తీరని అన్యాయం చేసాడని ఆయనే ఈ విషయంలో స్వయంగా కల్పించుకుని తనకు న్యాయం చేయాలనీ రాధా డిమాండ్ పెట్టినట్టు తెలుస్తోంది. అతి సున్నితమైన బెజవాడ పాలిటిక్స్ లో జగన్ తొందరపాటు నిర్ణయం తీసుకున్నదాని .. ఒక వేళ ఇక్కడ అభ్యర్థిని మార్చే విషయంలో స్వయంగా రాధనే పిలిచి పరిస్థితి వివరించి ఉంటే బాగుండేదని అభిప్రాయం పార్టీ నాయకులూ వ్యక్తం చేస్తున్నారు.