పగబట్టిన ప్రజలు ... టీడీపీ సర్వేలో ఇదే తేలిందా ..?     2018-08-09   10:42:39  IST  Sai Mallula

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లో రోజు రోజు కి ఆందోళన పెరిగిపోతోంది. ఒక వైపు చూస్తే సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరకు వచ్చేస్తోంది. మరో వైపు చూస్తే టీడీపీ ప్రవేశపెట్టిన జనాకర్షక పథకాలు ఆశించిన స్థాయిలో ప్రజలను మెప్పించలేకపోవడంతో బాబు కి కంగారు మొదలయ్యింది. దీనికి తోడు ప్రత్యర్థి పార్టీలైన వైసీపీ, జనసేన పార్టీలు రోజురోజుకి బలపడిపోతుండడం బాబు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీకి కంచుకోటలుగా ఉన్న గోదావరి జిల్లాల్లో పార్టీకి వ్యతిరేఖ పవనాలు వీస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

బాబు అంతగా ఆందోళన చెందడానికి సర్వేలు కూడా కారణం అని తెలుస్తోంది. ఏపీ లో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై , గెలుపోటములపై సొంతంగా చేయించిన సర్వేలో దిమ్మతిరిగే రిపోర్టులు రావడంతో మళ్ళీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అనే ఆందోళన ఎక్కువయ్యింది. రాష్ట్రా వ్యాప్తంగా 13 జిల్లాలలో దాదాపు వంద నియోజకవర్గాలలో గ్రామీణ స్ధాయిలో నిర్వహించిన సర్వేలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక గాలులు వీస్తున్నట్లుగా వెల్లడయింది అని ప్రచారం జరుగుతోంది.అలాగే ప్రతిపక్ష నేత జగన్ మోహాన రెడ్డికి అనుకూలంగా ఉన్నట్టు సర్వే రిపోర్టులు బాబు చేతికి అందాయట.

What Is Survey Effect On TDP-

What Is Survey Effect On TDP

ముంబయి కి చెందిన ఒక సంస్థ చేత ఈ సర్వే చేశారట. సర్వేలో ప్రభుత్వ పని తీరు ముఖ్యమంత్రి పని తీరు మంత్రుల – శాసన సభ్యుల – నాయకుల వ్యవహార శైలిపై సర్వే జరిగిందట. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై ప్రజలలో ఎలాంటి అభిప్రాయాలున్నాయి అనే అంశంపై సర్వేలో ప్రధాన ప్రశ్నగా తీసుకున్నారట. ముఖ్యమంత్రి చంద్రబాబు పని తీరుపై 34 శాతం మంది మాత్రమే సంతృప్తిగా ఉన్నారని, మంత్రులలో కొందరికి మంచి మార్కులే పడ్డాయి గానీ శాసనసభ్యులు నాయకుల్లో చాలా మంది పట్ల ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలో తేలిందట. ఇసుక దందా ప్రభుత్వ అధికారుల పట్ల శాసన సభ్యులు – నాయకులు వ్యవహరించిన తీరు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నట్లుగా వెల్లడించారట.

మరోసారి వీరు అధికారంలోకి వస్తే మరింతగా అవినీతి – అక్రమాలు పెరిగిపోతాయని ప్రజలలో ఓ భావన నెలకొన్నట్లు సర్వే ద్వారా తేటతెల్లమయింది అని అంటున్నారు. ఇక ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు పట్ల తెలుగదేశం పార్టీ పై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు తేలింది అని అంటున్నారు. హోదా కోసం పోరాడకుండా ప్యాకేజీ వైపు చంద్రబాబు మొగ్గు చూపడం ప్రజలలో అస‍హనం తీసుకువచ్చింది. రాష్ట్రానికి హోదా వస్తే నిరుద్యోగ సమస్య తీరడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశిస్తున్నారు. అయితే దానికి విరుద్దంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరించడంతో ప్రజలలో తీవ్ర నిరాశ చెందినట్టు సర్వేలో వెల్లడయింది అని ప్రచారం జరుగుతోంది.