టికెట్ దొరికినా ... మనీ ఇక్కట్లు తప్పడంలేదు !   The TRS Faces Financial Problems For Election Campaigning     2018-10-09   12:44:56  IST  Sai M

తెలంగాణ ఎన్నికల పుణ్యమా అని రాష్ట్రమంతా పండగా వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా మైకులు మారుమోగుతున్నాయి… రయ్యి రయ్యిమని ప్రచార వాహనాలు సందు గొందుల్లో తిరుగుతూ సందడి సందడి చేస్తున్నాయి. ఇక టీఆర్ఎస్ పార్టీ ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం .. ఆ లిస్ట్ లో తమ పేరు ఉండడం అభ్యర్థులకు ఆనందం కలిగిస్తున్నా… మరో వైపు ఆందోళన కూడా వెంటాడుతోంది. టికెట్ దొరికినా ప్రచార ఖర్చు భయపెట్టేస్తోంది. ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉండటంతో అంత భారాన్ని మోసేదెలా అంటూ తెగ మదనపడిపోతున్నారు. ఒకవైపు భారీగా ప్రచారం నిర్వహిస్తూనే, మరోవైపు భారీ ఎత్తున ఖర్చు మీద పడుతోందని లబోదిబోమంటున్నారు.

వాస్తవంగా అక్టోబరు చివరిలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వస్తుందని, నవంబరులో ఎన్నికలు జరుగుతాయని భావించారు. కానీ, ఆ ఆశలకు ఎన్నికల కమిషన్ నీళ్లు చల్లింది. అనూహ్యంగా తేదీలను మార్పు చేస్తూ ప్రకటన చేసింది. డిసెంబర్‌లో ఎన్నికలు ఉంటాయని అంది. దాంతో ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది.
ఎన్నికల ప్రచారం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు. రోజువారీ ఖర్చు లక్షల్లో ఉంటుంది. భోజనాలు, మందు, డబ్బు పంపకం తప్పనిసరిగా మారింది. ఈ లెక్కన చూసుకుంటే రెండు నెలలకు అయ్యే ప్రచార ఖర్చు కోట్లకు చేరుతుంది. ఆ మేరకు నిధులను సేకరించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.

The TRS Faces Financial Problems For Election Campaigning-

మరోవైపు మహా కూటమి అభ్యర్థుల ప్రకటన ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఎన్నికలకు బాగా సమయం ఇవ్వడంతో ఎన్నికల కమిషన్ ప్రకటనపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ పార్టీలకు ఖర్చుల విషయంలో కొంత వెసులుబాటు లభించింది. మహా కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా ఒక కొలిక్కి రాకపోవడంతో మరికొంత ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది. ఈ లెక్కన కూటమిలోని పార్టీలతో పోల్చుకుంటే … టీఆర్ఎస్ అభ్యర్థుల ఖర్చు తడిపి మోపెడు అయ్యేలా కనిపిస్తోంది.