ప్రణయ్ భార్యకు ఎమ్యెల్యే సీటు .. విమర్శలపాలవుతున్న రాజకీయం   Tammineni Veerabhadram Wants To Give MLA Ticket To Amrutha Pranay     2018-09-19   12:16:39  IST  Sai M

కొద్ది రోజులుగా మిర్యాలగూడ లో జరిగిన ప్రణయ్ హత్యా ఉదంతం పై మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ అంశం జాతీయస్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. సోషల్ మీడియా లో కూడా ఈ అంశంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు నెటిజెన్ లు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇది రాజకీయ రంగు పులుముకుంది. అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని ఏదో ఒక రకంగా వాడుకునేందుకు సిద్ధం అవుతున్నాయి. బాధితురాలికి ధైర్యం చెప్పాలిన ఈ సమయంలో ప్రణయ్ భార్య అమృతను రాజీకీయాల్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుండడం విమర్శలపాలవుతోంది.

ఈ విషయంలో ఇతర పార్టీల నేతల సంగతి పక్కనపెడితే.. కమ్యూనిస్టు పార్టీల నేతలకు మాత్రం మిర్యాలగూడలో అడుగుపెట్టగానే ఏం మాట్లాడుతున్నారో అర్థం కాని స్థితికి వెళ్లిపోతున్నారు. సీపీఐ నారాయణ అమృత తండ్రిని ఎన్‌కౌంటర్‌ చేసి పారేయాలని తీర్పు చెప్పేశారు. ఇక సీపీఎం నేత తమ్మినేని వీరబద్రం అయితే ఒకడుగు ముందుకు వేసి అమృతను ఏకగ్రీవంగా అసెంబ్లీకి పంపాలని తీర్మానించేశారు. మిర్యాగలగూడ మాజీ ఎమ్మెల్యే అయిన తమ్మినేని వీరభద్రం అమృతను పరామర్శించి ఆమెను ఎమ్మెల్యేని చేసి అసెంబ్లీకి పంపుదామని.. ఇందుకోసం అన్ని పార్టీలూ అభ్యర్థుల్ని పెట్టకుండా ఏకగ్రీవానికి తోడ్పడాలని పిలుపు ఇచ్చేసారు.

Tammineni Veerabhadram Wants To Give MLA Ticket Amrutha Pranay-

ఇప్పటికే అమృత ఇంటి చుట్టూ కుల సంఘాలు ప్రదిక్షణలు చేస్తున్నాయి. ఎవరికి వారు మా వాళ్లు మా వాళ్లు అనుకుంటూ చెలరేగిపోతున్నారు. వీరికి రాజకీయ నాయకులు జతకలిశారు. ఇక రోజూ పరామర్శకు వచ్చే చోటా రాజకీయ నేతల హడావుడి మామూలుగా లేదు. ప్రతీ దాన్ని రాజకీయ కోణంతో చూసి వారికి ఎమ్మెల్యే పదవులిస్తే.. గొప్పవారైపోతారన్నట్లుగా వ్యవహారాలు నడుపుతున్నారు. కానీ ఇది ప్రజల్లో వెగటు పుట్టిస్తోంది. ఆ విషయాన్ని వాళ్లు ఎప్పటికి తెలుసుకుంటారో మరి..!. అసలు అమృతను అసెంబ్లీకి పంపే అవకాశం కుదురుతుందా.. ఆమె వయస్సు 22 సంవత్సరాలని తెలుస్తోంది. ఎమ్యెల్యేగా పోటీ చెయ్యాలంటే 25 సంవత్సరాలు దాటాలి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోకుండానే ఎవరి ఇష్టమొచ్చినట్టు వారు మాట్లాడేయడం కరెక్టేనా.. ?