వీరమాచినేని డైట్ ఫాలో అయిన ఒకరు పంపిన లేఖ ఇది.! నాకు తగ్గలేదు.. కానీ నా భార్య విషయంలో మాత్రం..?     2018-08-29   10:58:41  IST  Sai Mallula

అధిక బరువుతో బాదపడుతున్నారా..షుగర్,బిపీ వ్యాధులున్నాయా..తిండి తినడం మానేస్తున్నారా..లేకపోతే ఆహారానికి పరిమితులు పెట్టుకుంటున్నారా..ముల్లును ముల్లుతోనే తీయాలి అనే సామెత విన్నారా.?ఇప్పుడు అదే రూల్ ఫాలో అవుతున్నారు వీరమాచినేని రామకృష్ణారావు..కొవ్వుని కొవ్వుతోనే చెక్ పెట్టిస్తున్నారు..డయాబెటిస్ ,బిపి లాంటి వాటితో ఇబ్బందిపడుతున్నా ఎంచక్కా తినాలనుకున్నది తినేయడమే అంటున్నారు.ఎటువంటి మందులు వాడకుండా, శారీరక వ్యాయామం లేకుండా కేవలం ఆహార నియమాలతో అతితక్కువ కాలంలోనే సంపూర్ణ ఆరోగ్యవంతులు ఎలా కావాలో తెలిపారు. కొన్ని నెలల క్రితం ఈ వీరమాచినేని డైట్ చాలా ట్రెండ్ అయ్యింది.

శాంతా బయోటెక్నిక్స్‌ వ్యవస్థాపకుడు వరప్రసాద్‌ రెడ్డి సైతం తన డైట్‌ పాటించి ఇన్సులిన్‌ను పక్కకు పడేశారని వీరమాచనేని రామకృష్ణ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీంతో ఆ విధానాన్ని పాటించి తాను సంపూర్ణంగా మధుమేహం నుంచి బయటపడ్డానన్న భావన ప్రేక్షకులకు, వీక్షకులకు కలిగిందని.. దాంతో చాలామంది నుంచి తనకు ఫోన్లు వస్తున్నాయని వరప్రసాద్‌ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. కానీ వీరమాచనేని డైట్‌తో వల్ల తన షుగర్‌ తగ్గలేదని.. తన భార్య మధుమేహం మాత్రం నియంత్రణలోకి వచ్చిందని తెలుపుతూ ప్రత్యేకంగా వ్యాసం రాశారాయన. ఆ వ్యాసం సారాంశం ఆయన మాటల్లోనే..

సమతుల్య ఆహారం అంటే తగుమోతాదులో పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్స్‌), మాంసకృతులు (ప్రొటీన్స్‌), కొవ్వు (ఫ్యాట్స్‌). ఈ మూడింటి మధ్య సరైన నిష్పత్తిని కాపాడుకోవడమే సమతుల్య ఆహారం. వీరమాచనేని రామకృష్ణ వృత్తిరీత్యా వైద్యులు కానప్పటికీ ఒక సహేతుకమైన కారణంతో ‘వీరమాచనేని డైట్‌’ అనే ప్రతిపాదన చేసి అనేక మందిని ప్రభావితం చేయగలిగారు. మన ఆహారంలో సమతుల్యత లోపించిందన్న ప్రధాన లోపాన్ని గుర్తెరిగి, పిండిపదార్థాలను బాగా తగ్గించడం వారి ప్రతిపాదనలో ప్రధానాంశం. ఇటు మందులుకానీ, ఇన్సులిన్‌ కానీ మధుమేహం నుంచి శాశ్వత నివారణ ఇవ్వలేకపోగా ఇతరత్రా శరీరంలోని అవయవాలకు నష్టాలు చేకూరుస్తున్నాయి. నాకు ఈ తర్కంలో సత్యం గోచరించింది. ఆ కారణంగా నాకున్న 22 ఏళ్ల మధుమేహ స్థితిని వీరమాచనేనివారి ఆహారవిధానంతో సరిచేసుకుందామన్న నిర్ణయానికి వచ్చి వారి ఆహార సూత్రాలను పాటించడం మొదలుపెట్టాను. నా శ్రీమతి కూడా ఈ సూత్రాలను పాటించడం మొదలుపెట్టారు.

Shantha Biotechnics Founder Varaprasad Reddy About Veeramachaneni Diet-

Shantha Biotechnics Founder Varaprasad Reddy About Veeramachaneni Diet

గతంలో నేను ఒక టీవీ ఇంటర్వ్యూలో వీరమాచనేని డైట్‌ పాటిస్తున్న విషయాన్ని చెప్పను. ఇప్పుడు అది అనేక మంది అనుసరిస్తున్నారు. దీంతో, ఈ విధానం బాగోగుల గురించి వివరించాల్సిన బాధ్యత నాపై ఉంది. నేను వారు చెప్పిన రీతిలో సంపూర్ణంగా వరిబియ్యం, పప్పుదినుసులు, పండ్లు, దుంపకూరలు, చక్కెర, బెల్లం పూర్తిగా నా ఆహారంలో లేకుండా జాగ్రత్త పడ్డాను. వారు చెప్పిన విధంగా మూడు పూటలా కొబ్బరి నూనె (ప్రతి రోజూ 70 గ్రాములు) కూరలలో వాడాం. ఆవునెయ్యి వాడాం. రోజుకు 2-3 గుడ్లు తీసుకున్నాం. మేం వాడుతున్న ఇన్సులిన్‌, ట్యాబ్లెట్లు పూర్తిగా పక్కకు పెట్టేశాం. నా విషయంలో 80 రోజులు గడిచినా ఫాస్టింగ్‌ షుగర్‌ లెవల్స్‌ (పరగడుపున చక్కెరస్థాయులు) 180, 190 స్థాయికి తగ్గలేదు. నా శ్రీమతి విషయంలో మాత్రం మెరుగైన ఫలితాలు వచ్చాయి.

నా విషయంలో హెచ్‌బీఎ1సీ (యావరేజ్‌ గ్లూకోజ్‌ లెవెల్స్‌) 8.5కు తగ్గలేదు. నా శ్రీమతికి మాత్రం 6.1 స్థాయికి తగ్గింది. నా విషయంలో సరైన ఫలితాలు రాలేదని తెలుస్తూనే ఉంది. నా శ్రీమతి విషయంలో మాత్రం సరైన ఫలితం వచ్చింది.నేను సైన్స్‌, ఇంజనీరింగ్‌ విద్యార్థిని. ఎలకా్ట్రనిక్స్‌ రంగంలో సైంటి్‌స్టను. దేన్నయినా సరే గుడ్డిగా అనుసరించకుండా, మొండిగా కొట్టిపారేయకుండా ప్రయోగించి చూడటం నాకు అలవాటు. ప్రకృతి చికిత్స, ఆయుర్వేదం, హోమియోపతి, అలోపతి.. ఇలా అన్నీ నాపై ప్రయోగించి చూసుకుంటూ ఉంటాను. నాకు నప్పింది కొనసాగిస్తాను. అలా వీరమాచనేని ఆహారవిధానాన్ని కూడా ప్రయోగాత్మకంగానే ఆచరించి చూశాను. అయితే, 80 రోజులుగా నా షుగర్‌ లెవల్స్‌ తగ్గకపోవడం డాక్టర్‌ పి.వి.సత్యనారాయణగారికి ఆందోళన కలిగించింది.

రెటినోపతి ప్రమాదముందని హెచ్చరించారు. ఒక్కసారిగా మందులు వాడకం మానేయడం సరైనది కాదని వారి సూచన. అందులోనూ తర్కం ఉంది. ఒక్కసారిగా మందులు మానేయడం ప్రమాదం. వాడుతున్న మందుల మోతాదును క్రమంగా తగ్గించుకుంటూ శరీరానికి మందులు వాడని లక్షణాలను అలవాటు చేయాలి. ఈ తర్కాన్ని వీరమాచనేనివారు యదార్థమని గుర్తించి వారి ప్రసంగాల్లో మార్పు తీసుకురావాలి. లేదంటే ప్రమాదమే. ప్రతి వ్యక్తి, ప్రతి రోగి ఒకే విధంగా యూనిఫారంగా మందులకు స్పందించరు.

Shantha Biotechnics Founder Varaprasad Reddy About Veeramachaneni Diet-

90 రోజులు, అవసరమనిపిస్తే మరో 30 రోజులు వారి ఆహారవిధానాన్ని పాటించి మధుమేహాన్ని శాశ్వతంగా తరిమేయవచ్చని ఆయన అంటున్నారు. అది సరికాదు. సమతుల్య ఆహారం తీసుకుంటూ, చక్కెర స్థాయులను గమనించుకుంటూ తగుమాత్రమైన మందులు వేసుకుంటూ కొంతకాలం సాధన చేస్తేనే ఈ వ్యాధి తాలూకూ దుష్ఫలితాలను నివారించుకోవచ్చు.

వారు చెబుతున్నట్లుగా 90 లేదా 120 రోజుల నియమం పాటించి ఆ తర్వాత అన్ని పదార్థాలు, స్వీట్లు, మామిడి పండ్లు తినవచ్చు అనే భరోసాలో వాస్తవం లేదు. ఆహార నియమాలు జీవితమంతా తప్పనిసరి. మందులు క్రమేపీ తగ్గించుకోవడానికి పయ్రత్నం చేయాలి. అందుకు దోహదం చేసేవి క్రమం తప్పని వ్యాయామం, నడక, వీలైతే ప్రాణాయామం, ధ్యానం, యోగ వగైరాలు. వీటి ద్వారా అటు మానసిక స్థితిని ఇటు శారీరక స్థితిని అదుపులో ఉంచుకోవచ్చు. వీరమాచనేని డైట్‌ను ఫాలో అవుతున్నవారంతా ఈ సత్యాలను గుర్తించాలని నా మనవి.’’

– వరప్రసాద్‌ రెడ్డి, శాంతా బయోటెక్నిక్స్‌ వ్యవస్థాపకులు, చైర్మన్‌