అతడొక రోజు కూలీ.. లాటరీ టికెట్ కొనడానికి అప్పు చేశాడు..కోటిన్నర లాటరీ గెలుచుకున్నాడు..   Sangrur Labourer Wins Rs 1.5 Crore Lottery     2018-09-14   11:22:38  IST  Rajakumari K

అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో వరిస్తుందో తెలియదు.. నిన్నటి వరకు కూలి పని చేసుకున్న వ్యక్తి రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అవుతాడని ఎవరైనా నమ్ముతారా..కానీ అదృష్టం నెత్తిమీద బ్రేక్ డ్యాన్స్ చేస్తుంటే ఖచ్చితంగా అవుతారు.. పంజాబ్ కు చెందిన మనోజ్ కుమార్ దగ్గరకి లక్ష్మి దేవి లాటరీ రూపంలో వచ్చింది..ఇంతకీ ఆ లాటరీ టికెట్ కొనడానికి కూడా అప్పు చేసిన పేదవాడు మనోజ్… కానీ ఇప్పుడు..కోటిన్నర రూపాయలకు అధిపతి..

మనోజ్ కుమార్ ఓ సాధారణ కూలీ… భార్యతో కలిసి కూలి పనిచేసేవాడు.రోజంతా ఇద్దరు భార్యాభర్తలు కలిసి పనిచేస్తే రోజుకు రూ.250 సంపాదించేవారు. వచ్చిన సంపాదనతో నలుగురు పిల్లల్ని పోషిస్తూ రోజు గడుపుకునే పరిస్థితి మనోజ్ ది..లాటరీ టికెట్లపై పెద్దగా ఆసక్తి లేని మనోజ్..ఒకసారి లాటరీ టికెట్ కొని తన అదృష్టాన్ని పరిక్షించుకోవాలనుకున్నాడు..కానీ టికెట్ కొనడానికి చేతిలో డబ్బులు లేవు .దాంతో పక్కంటివారి దగ్గర రూ.200 అప్పుచేసి మరీ లాటరీ టిక్కెట్ కొన్నాడు. పంజాబ్ ప్రభుత్వం నిర్వహించిన లాటరీలో రూ.1.5 కోట్లు వరించడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరయ్యాడు.చేసిన అప్పెలా తీర్చాలా అని ఆలోచిస్తున్న మనోజ్ కి,అప్పు చేసి కొన్న లాటరీ టికెటే తన జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది.

Sangrur Labourer Wins Rs 1.5 Crore Lottery-

మనోజ్ దంపతులకు నలుగురు సంతానంలో ముగ్గురు అమ్మాయిలే కాగా, పెద్ద కుమార్తె ఈఏడాది ఇంటర్ పూర్తిచేసినా ఆర్థికస్థోమత లేకపోవడంతో చదువుకు పుల్‌స్టాప్ పెట్టేసింది. అయితే, ఇప్పుడు లాటరీ వల్ల తమ సమస్యలు తీరిపోయాయని, తిరిగి తనను చదివిస్తానని మనోజ్ తెలిపాడు. మనోజ్ తండ్రి ఇటీవలే అనారోగ్యంతో కన్నుమూశాడు. ఆస్తమాతో బాధపడుతోన్న తండ్రిని బతికించుకోలేకపోయానని, ఇదే లాటరీ ఇంతకు ముందు వచ్చుంటే ఆయన్ను కాపాడుకునే అవకాశం దక్కేదని వాపోయాడు. రాఖీ బంపర్ లాటరీలో తన టిక్కెట్‌కు ప్రైజ్ మనీ దక్కిందని స్థానిక పోస్టాఫీసు తెలియజేసే వరకూ అతడికి ఈ విషయం తెలియలేదు. మరి కొద్ది రోజుల్లో కోటిన్నర ఆయన ఖాతాలోకి వచ్చి పడనుంది.నిన్న మొన్నటివరకు ఆ కుటుంబాన్ని పట్టించుకోని వారు కూడా ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నారు.అంతేకాదు ఇప్పుడు వారింటికి మార్కెటింగ్ ఏజెంట్లు, బ్యాంకర్లు క్యూకడుతూ తమ సంస్థల్లో డిపాజిట్ చేయాలని కోరుతున్నారు.