ర‌న్నింగ్ ట్రెయిన్‌లో వాట్సాప్ సహాయంతో ఆ యువకుడు ఓ గ‌ర్భిణీకి పురుడు పోశాడు! హ్యాట్సాఫ్ బ్రదర్!     2018-08-22   09:47:27  IST  Sai Mallula

అమీర్‌ఖాన్ నటించిన 3 ఇడియ‌ట్స్ సినిమా గుర్తుందా..? అందులో ఓ గర్భిణీ మ‌హిళ‌కు అమీర్ త‌న ఫ్రెండ్స్ డెలివ‌రీ చేస్తారు. ముఖ్యంగా అమీర్‌ఖాన్ ఆమెకు డెలివ‌రీ చేసేందుకు చాలా క‌ష్ట‌ప‌డ‌తాడు. వీడియోకాల్ మాట్లాడుతూ డాక్ట‌ర్లు ఇచ్చే సూచ‌న‌ల మేర‌కు అమీర్ ఆ మ‌హిళ‌కు డెలివ‌రీ చేస్తాడు. దీంతో శిశువు ఆరోగ్యంగా జ‌న్మిస్తుంది. అయితే ఇలాంటి సంఘ‌ట‌న‌లు సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ జ‌రుగుతాయి. అందుకు ఉదాహ‌ర‌ణే ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఘ‌ట‌న‌. రైలులో జ‌రిగింది. పురిటి నొప్పుల‌తో బాధ‌ప‌డుతున్న ఓ గ‌ర్భిణీకి హౌస్ స‌ర్జ‌న్‌గా చేస్తున్న ఓ యువ‌కుడు డెలివ‌రీ చేశాడు. అయితే శిశువు జ‌న్మించ‌గానే శ్వాస తీసుకోలేదు. అయినప్ప‌టికీ వాట్సాప్‌లో సీనియ‌ర్ డాక్ట‌ర్లు ఇచ్చే సూచ‌న‌ల‌తో ఆ శిశువుకు ప్రాణం పోశాడు అత‌ను.

అత‌ని పేరు విపిన్ ఖ‌డ్సే. వ‌య‌స్సు 24 సంవ‌త్స‌రాలు. నాగ‌పూర్‌లోని ఓ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో ఎంబీబీఎస్ చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతున్నాడు. అత‌ను ఓ హౌస్ స‌ర్జ‌న్‌. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 7వ తేదీన అకోలా నుంచి నాగ‌పూర్‌కు అహ్మ‌దాబాద్ పూరీ ఎక్స్‌ప్రెస్‌లో అత‌ను ప్ర‌యాణం చేస్తున్నాడు. కాగా అదే ట్రెయిన్‌లో మ‌రో బోగీలో ఉన్న ఓ నిండు గ‌ర్భిణీకి పురిటి నొప్పులు ప్రారంభ‌మ‌య్యాయి. దీంతో విష‌యం తెలుసుకున్న టీసీ ఆ ట్రెయిన్‌లో ఎవ‌రైనా డాక్ట‌ర్లు ఉన్నారేమో అని వెతికాడు. కానీ డాక్ట‌ర్లు దొర‌క‌లేదు. అయితే అదే ట్రెయిన్‌లో విపిన్ ఉండ‌డంతో టీసీ ద్వారా అత‌ను విష‌యం తెలుసుకుని మ‌హిళ‌కు డెలివ‌రీ చేసేందుకు సిద్ధ‌మ‌య్యాడు. స్వ‌త‌హాగా హౌస్ స‌ర్జ‌న్ కావ‌డంతో సాధార‌ణ శ‌స్త్ర చికిత్స‌కు ప‌నికొచ్చే ముఖ్య‌మైన ప‌రిక‌రాలు అత‌ని వ‌ద్ద ఉన్నాయి. దీంతో మ‌హిళ‌కు డెలివ‌రీ చేసేందుకు పెద్ద‌గా అత‌ను ఇబ్బంది ప‌డ‌లేదు.

MBBS Student Uses WhatsApp To Help Deliver Baby On Moving Train-

MBBS Student Uses WhatsApp To Help Deliver Baby On Moving Train

అయితే ఆ మ‌హిళ‌కు డెలివ‌రీ చేసే స‌మ‌యంలో శిశువు తల మొద‌ట రాలేదు. అందుకు బ‌దులుగా ఓ భుజం బ‌య‌టికి వ‌చ్చింది. దీంతో అత‌ను వాట్సాప్‌లో వీడియో కాలింగ్, మెసేజ్‌ల ద్వారా సీనియ‌ర్ డాక్ట‌ర్ల‌ను సంప్రదించాడు. వారు అత‌నికి సూచ‌న‌లు ఇచ్చారు. ఈ క్ర‌మంలో విపిన్ ఆ మ‌హిళ‌కు విజ‌య‌వంతంగా డెలివ‌రీ చేశాడు. అయితే శిశువు పుట్ట‌గానే శ్వాస తీసుకోలేదు. దీంతో మ‌ళ్లీ వాట్సాప్ ద్వారా సీనియ‌ర్ డాక్ట‌ర్ల‌ను సంప్ర‌దించ‌గా వారు సూచ‌న‌లు చేశారు. అలా వారి సూచ‌న‌ల‌తో శిశువుకు విపిన్ ప్రాణం పోశాడు. శిశువు శ్వాస తీసుకోవ‌డం మొద‌లు పెట్ట‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.

MBBS Student Uses WhatsApp To Help Deliver Baby On Moving Train-

ఈ ఘ‌ట‌న జ‌రిగి 5 నెల‌లు గ‌డుస్తున్నా విపిన్‌కు ఇంకా శుభాకాంక్ష‌ల వెల్లువ ఆగ‌డం లేదు. అయితే ప్ర‌స్తుతం అత‌ను ఎంబీబీఎస్ చివ‌రి సంవ‌త్స‌రంలో ఉన్నందున తాను త్వ‌ర‌లో న్యూరాల‌జీలో స్పెషాలిటీ చేస్తాన‌ని అంటున్నాడు. కాగా అత‌ను ర‌న్నింగ్ ట్రైన్‌లో వాట్సాప్ ద్వారా సూచ‌న‌లు తీసుకుంటూ గ‌ర్భిణీకి డెలివ‌రీ చేసినందున త్వ‌ర‌లో ఈ అంశం గిన్నిస్ బుక్ రికార్డ్స్‌లోకి ఎక్క‌నుంద‌ట‌. అంతేకాదు, ఫేస్‌బుక్ సంస్థ అయితే విపిన్‌కు జ‌రిగిన సంఘ‌ట‌న‌ను స్టోరీ రూపంలో తీసుకురానుంది. అందుకు గాను ఏకంగా న్యూయార్క్ నుంచి ఫేస్‌బుక్ ప్ర‌తినిధులు రానున్నార‌ట‌. ఏది ఏమైనా విపిన్ అలా రెండు ప్రాణాల‌ను బ‌తికించ‌డం అభినంద‌నీయం క‌దా..!