చెమటలు పట్టిస్తున్న సోషల్ మీడియా ! అందుకే టీఆర్ఎస్ లో కొత్త సిబ్బంది   KCR New Staff In TRS About Social Media     2018-09-22   12:37:26  IST  Sai M

పార్టీలకు మీడియా అవసరం చాలా ఉంటుంది. తాము చేసిన కార్యక్రమాలు.. చేయాల్సిన కార్యక్రమాల గురించి ప్రజల్లోకి వేగంగా వెళ్లాలంటే అదొక్కటే మార్గం. కొన్ని కొన్ని పార్టీలు తమ తప్పులు బయటపడకుండా కేవలం తమకు అనుకూలంగా ఉండే కథనాలే మీడియాలో ప్రచారం చేయించుకుంటూ ఉంటారు. రాజకీయ నాయకులకు మీడియా మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలో బాగా తెలుసు కాబట్టి ఆమేరకు కథనాల్లో అనుకూలత ఉండేలా చూసుకుంటున్నారు. కానీ ఈ మధ్యకాలం లో సాంకేతిక విప్లవం బాగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు సోషల్ మీదకి లో యాక్టివ్ గా ఉంటున్నారు. ఏ మూలాన ఏమి జరుగుతుందో క్షణాల్లో తెలుసుకుంటున్నారు. ఇక నాయకుల వ్యవహారాలూ కూడా సోషల్ మీడియా వేదికగా బట్టబయలు అవుతున్నాయి.

ఇక తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే… అన్ని పార్టీల కంటే ముందే ప్రచార బరిలోకి దిగిన టీఆర్ఎస్ కి సోషల్ మీడియాతో తలనొప్పి తప్పట్లేదు. ప్రజల్లోకి వెళ్తున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను కొన్ని చోట్ల స్థానిక సమస్యలపై నిలదీస్తున్నారు. అధికార పార్టీని ఇరుకున పెట్టే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందుకే సోషల్ మీడియాలో విమర్శలపై వార్ కు రెడీ అయ్యింది టీఆర్ఎస్. సోష‌ల్ మీడియాలో ప్ర‌తిప‌క్షాలు కొన‌సాగిస్తోన్న వ్య‌తిరేక‌ప్ర‌చారంపై ఎదురుదాడి చేయాలని నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేసింది టీఆర్ఎస్.

కొత్త‌గూడెం నియోజ‌క‌వ‌ర్గంలో మాజీ ఎమ్మెల్యే జలగం వెంక‌ట్రావు ముందు స్థానిక మహిళలు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. ఈక్రమంలో ఆయన వారిపై చిరాకు పడటం సామాజిక మాద్యమాల్లో వైరల్ అయ్యింది. అలాగే మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఓ మహిళతో అసభ్యకరంగా మాట్లాడిన ఆడియో క్లిప్పింగ్స్ వాట్సప్ గ్రూపుల్లో వైరల్ గా మారాయి. మరోవైపు మాజీ డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ప్రచారం డబుల్ బెడ్ రూం ఇండ్లకోసం ప్రజలు నిలదీసారు. ఇది కూడ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమైంది.

KCR New Staff In TRS About Social Media-

ఎన్నికల ముందు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పార్టీ వ్యతిరేక ప్రచారం అధికార పార్టీకి ఇబ్బందిగా మారుతోంది. ఈ వ్యతిరేక ప్రచారమంతా కాంగ్రెస్ చేయిస్తోంద‌ని గులాబీ నేతలు భావిస్తున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా వార్ కు సిద్ధమైంది. వ్యతిరేక ప్రచారంపై కౌంటర్ పోస్టులు చేస్తూనే.. ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయించింది. 150 మందితో సోషల్ మీడియా టీమ్ ను ఏర్పాటు చేసిందీ టీఆర్ఎస్. ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి ఒక‌రిని సోష‌ల్ మీడియా స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించారు. ఇక‌ సోషల్ మీడియా ప్రచార బాధ్యతలను ఎంపీ కవితకు అప్పగించారు.

అంతే కాకుండా పార్టీ ప్రచారంలో సాంకేతికతను పెద్దపీట వెయ్యాలని నిర్ణయించారు. అందులో భాగంగా… కేసీఆర్ పాల్గొనే వంద సభలకు డిజిటల్ టెక్నాలజీ జోడించనున్నారు. ప్రచార స‌భ‌ల‌కు హాజరు కాని వారు కూడా కేసీఆర్ ప్రసంగాన్ని తిలకించేలా గ్రామాల్లో పట్టణాల్లో డిజిటల్ తెరలు ద్వారా ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది.