కారు పార్టీకి కంగారు పుడుతోందా ... ఎందుకు  

తెలంగాణా అధికార పార్టీ టీఆర్ఎస్ దూకుడుగా ఉంది. రాబోయే ఎన్నికల్లో విజయం తమదే అనే ధీమా లో ఉంది. అందుకే ముందస్తు ఎన్నికలకు కూడా వెళ్లేందుకు సిద్ధం అవుతోంది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. టీఆర్ఎస్ ఎంత ధీమా వ్యక్తం చేస్తున్న మారుతున్న రాజకీయ పరిస్థితులు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. అయితే ఆ భయం ఎక్కడా కనిపించనీయకుండా పైకి మాత్రం గంభీరంగా ప్రకటనలు గుప్పిస్తున్నారు టీఆర్ఎస్ ముఖ్య నాయకులు. ముఖ్యంగా తెలంగాణాలో రోజు రోజుకి కాంగ్రెస్ పార్టీ బలపడడం టీఆర్ఎస్ ను కలవరపెడుతోంది.

KCR Getting Tension On The Party-

KCR Getting Tension On The Party

మొన్నటివరకు గ్రూపు రాజకీయాలతో సతమతమైన కాంగ్రెస్ కు రాహుల్ ట్రీట్మెంట్ అందడంతో అంతా సెట్ అయిపోయి పార్టీని పటిష్ట పరిచే పనిలో పడ్డారు. ముఖ్యంగా … కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకుని పావులు కదుపుతున్నట్లు సమాచారం. 2014ఎన్నికల్లో కొన్ని జిల్లాల్లోనే టీఆర్ఎస్ పార్టీ సత్తాచాటింది. నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, మెదక్ తదితర జిల్లాల్లోనే సత్తాచాటి 63 స్థానాల్లో గెలిచింది. ఇక ఖమ్మంలో ఒకే ఒక్కసీటు గెల్చుకుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఒకటి రెండు సీట్లకే పరిమితం అయింది.
ఇప్పుడు గత ఎన్నికల్లో ఎక్కువసీట్లు గెలిచిన జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కొంత ఇబ్బంది కరమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది. గ్రూపులు ఏర్పడ్డాయి. ఒక్కసీటు కోసం అనేకమంది పోటీపడే పరిస్థితి వచ్చింది.

టీఆరెఎస్ లో నెలకొన్న గ్రూపు రాజకీయాలను తమకు అనుకూలంగా మార్చుకుని ఆయా నియోజకవర్గాల్లో సీట్లు కొల్లగొట్టాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్‌లో వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లనూ గెలుచుకోవాలని టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. కానీ, ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు ఆ పార్టీకి ప్రతికూలంగా మారుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సీఎం కేసీఆర్ మద్దతు తెలుపకపోవడం.. ఏపీకి ఇస్తే తమకూ ఇవ్వాలని టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చెయ్యడం వంటి పరిణామాలతో టీఆర్ఎస్ పై సెటిలర్లు ఆగ్రహంగా ఉన్నారు.

KCR Getting Tension On The Party-

వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రులకూ టికెట్లు ఇస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ప్రకటించారు. తెలంగాణలోని దాదాపు 40స్థానాల్లో సెటిలర్లు గెలుపు ఓటములను శాసించే స్థాయిలో ఉన్నట్లు పలువురు నాయకులు చెబుతున్నారు. ఇదే సమయంలో ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ దగ్గరవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో టీఆర్ఎస్‌కు ముస్లింలు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో రాహుల్ గాంధీ పర్యటన కూడా ఖరారు అయింది. ఈనెల 13, 14న హైదరాబాద్‌లో ఆయన పర్యటించనున్నారు. దీంతో గులాభీ దళంలో ఆందోళన పెరిగింది. రోజురోజుకి కాంగ్రెస్ బలపడడం టీఆర్ఎస్ నాయకులకు మింగుడు పడడంలేదు.