పవన్ పార్టీ పుంజుకుంటోందా .? ఈ స్పీడ్ కి రీజన్ ఏంటి ..?     2018-08-12   12:47:16  IST  Sai Mallula

రాజకీయంగా మనుగడ కోల్పోయిన వారందరికీ ఇప్పుడు ఒకటే దారి కనిపిస్తోంది అదే జనసేన . మొదట్లో పవన్ ప్రభావం పెద్దగా ఉండదనే లెక్కల్లో ఉన్న వారంతా ఇప్పుడు పవన్ రాజకీయంగా పుంజుకోవడంతో ఆశగా ఆ పార్టీ వైపు చూస్తున్నారు. మళ్ళీ రాజకీయంగా బలపడి తమ ప్రాబల్యాన్ని పెంచుకోవచ్చని ఆలోచనలో ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే జనసేనసేనలో చేరికలు.. గోదావరి జిల్లాల్లో, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. పలువురు నేతలు పవన్ కల్యాణ్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అటు తెలుగుదేశం పార్టీ నుంచి, ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తమకు పెద్దగా గుర్తింపు లేదనుకుంటున్న వారంతా ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారు.

Kapu Leaders Quee To Janasena Party-

Kapu Leaders Quee To Janasena Party

పవన్ పార్టీ పెట్టి నాలుగేళ్లు దాటుతున్నా.. పెద్దగా చేరికలు ఏవి కనిపించలేదు. దీనికి కారణం పవన్ ప్రభావం ఎన్నికల్లో నామమాత్రంగా ఉంటుందనే ధీమానే. కానీ కొద్దీ రోజులుగా పవన్ తన ప్రసంగాలు, పర్యటనల్లో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ముందుకు వెళ్తున్నాడు. దీంతో పవన్ మీద నమ్మకం పెరిగి పార్టీలోకి వలసలు ఎక్కువయ్యాయి. ఇందులో ఎక్కువగా పవన్ సామాజికవర్గం అయిన కాపు నాయకులూ క్యూ కడుతున్నారు. ఇప్పుడు పార్టీలో ఉన్న నాయకుల్లో మెజార్టీ ఆ సామాజికవర్గం వారే. ఇదంతా చూస్తుంటే కాపులు జనసేన కు బాగా దగ్గరవుతున్నట్టు కనిపిస్తోంది.

తనకు కులం లేదని జనసేన అధిపతి పవన్ కల్యాణ్ పదే పదే చెబుతూ ఉంటారు. అయితే పవన్ కల్యాణ్ పై కాపు ట్యాగ్ ఎప్పుడో పడిపోయింది. పవన్ కల్యాణ్ రాజకీయం పై కూడా అదే ట్యాగ్ పడటానికి కారణం అవుతోంది. పవన్ కల్యాణ్ ప్రధానంగా గోదావరి జిల్లాల మీద దృష్టి పెట్టడం.. అక్కడక్కడే తిరుగుతూ ఉండటం వంటి పరిణామాలు కూడా పవన్ పై కాపు ట్యాగ్ పడటానికి కారణం అవుతోంది. ఇక ఇదే సమయంలో.. జనసేన అధిపతి ఏరి కోరి కొందరిని కలుస్తున్నాడు. స్వయంగా వెళ్లి వాళ్లతో సమావేశం అవుతున్నాడు. వాళ్లంతా కాపు నేతలే . అంతేకాదు రాజకీయంగా మనుగడ కోల్పోయిన కాపు నాయకుల ఇళ్లకు వెళ్లి మరీ జనసేన జెండా వారి మేడలో వేసి మరీ పార్టీలోకి ఆహ్వానిస్తూ పవన్ కొత్త రాజకీయానికి తెరతీశాడు