జగపతిబాబుకూ ఆ విషయంలో ఆసక్తి.. సక్సెస్‌ అయ్యేనా?     2018-08-16   08:29:56  IST  Ramesh Palla

టాలీవుడ్‌లో 1990లో ఫ్యామిలీ హీరోగా స్టార్‌డంను దక్కించుకున్న జగపతిబాబు ప్రస్తుతం సెకండ్‌ ఇన్నింగ్స్‌లో విలన్‌ పాత్రల్లో, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా నటిస్తున్న విషయం తెల్సిందే. హీరోగా నటించినదానికంటే ఇప్పుడు ఎక్కువగా జగపతిబాబు సంపాదిస్తున్నాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతూ వస్తున్నారు. హీరోగా ఉన్న సమయంలో ఎక్కువగా వృదా చేసే జగపతిబాబు ప్రస్తుతం తన ప్రతి పైసాను కూడా జాగ్రత్తగా వాడుతున్నట్లుగా ఆయన స్వయంగా చెప్పుకొచ్చాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ప్రతి సినిమాలో జగపతిబాబు ఉంటున్నాడు.

‘సైరా’, ‘అరవింద సమేత’ ఇలా పలు పెద్ద చిత్రాల్లో జగపతిబాబు కనిపించబోతున్నాడు. అందుకే జగపతిబాబు భారీగా పారితోషికాలను అందుకుంటున్నాడు. తనకు దక్కిన పారితోషికంను సరైన రీతిలో వినియోగించాలనే ఉద్దేశ్యంతో జగపతిబాబు నిర్మాతగా మారాలని నిర్ణయించుకున్నాడు. అయితే సినిమాల నిర్మాత కావాలి అంటే కోట్లు కావాలి. అందుకే సినీ నిర్మాత కాకుండా వెబ్‌ సిరీస్‌ను నిర్మించేందుకు సిద్దం అయ్యాడు.

Jagapathi Babu To Start New Web Series And Art Film-

Jagapathi Babu To Start New Web Series And Art Film

జగపతిబాబు త్వరలోనే ఒక వెబ్‌ సిరీస్‌ను నిర్మించబోతున్నాడు. దాదాపు 50 లక్షలతో ఈ వెబ్‌ సిరీస్‌ను ఆయన నిర్మిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందబోతున్న ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. ఆ వెబ్‌ సిరీస్‌లో గెస్ట్‌ రోల్‌లో జగపతిబాబు కూడా కనిపించబోతున్నాడు. ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన జగపతిబాబు ఇప్పుడు నిర్మాతగా మారబోతున్నాడు. ఇందులో సక్సెస్‌ అయితే భవిష్యత్తులో సినిమాలను కూడా ఈయన నిర్మిస్తాడేమో చూడాలి.

జగపతిబాబు తండ్రి విబి రాజేంద్ర ప్రసాద్‌ గారు కూడా ప్రముఖ నిర్మాత అనే విషయం తెల్సిందే. ఎన్నో అద్బుతమైన చిత్రాలను ఆయన నిర్మించారు. ఆయన దారిలోనే జగపతిబాబు కూడా భవిష్యత్తులో మంచి నిర్మాతగా పేరు తెచ్చుకోవాలని ఆయన శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జగ్గూభాయ్‌ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన మరింత సమాచారం అధికారికంగా విడుదల చేయబోతున్నారు.