ఇలియానా అంటే తెలుగు నిర్మాతలకు ఎందుకు ఇంత మోజు?   Ileana With Hero Ram After 12 Years     2018-09-24   09:23:19  IST  Ramesh P

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని ముద్దుగుమ్మ ఇలియానా. చాలా సంవత్సరాల క్రితం తెలుగు సినిమా పరిశ్రమ నుండి దూరం అయ్యి బాలీవుడ్‌కు చెక్కేసిన ఈ అమ్మడు అక్కడ మంచి సినిమాల్లో నటించింది. అయితే ఈమె క్రేజ్‌ అక్కడ కొంత కాలం మాత్రమే కొనసాగింది. ఈమె కొన్నాళ్లకే అక్కడ కనుమరుగు అయ్యింది. బాలీవుడ్‌ సినిమాలకు దాదాపు రెండు సంవత్సరాల పాటు దూరంగా ఉన్న ఇలియానా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి కూడా చేసేసుకుంది.

ఇలియానా పెళ్లి చేసుకుంది.. ఇక ఆమెను వెండి తెరపై చూడలేం అంటూ అంతా అనుకున్నారు. కాని తెలుగు దర్శక నిర్మాతలు ఈమెపై చాలా మోజు పడుతున్నారు. అందుకే ఇప్పుడు కూడా ఈమెకు కోట్లు గుమ్మరించి తమ సినిమాల్లో నటింపజేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. తెలుగులో ఈమె చేసిన చిత్రాలు అప్పుడు మంచి విజయాన్ని సాధించాయి. అందుకే ఇప్పుడు కూడా ఈమెతో సినిమాలు చేయాలని నిర్మాతలు మరియు దర్శకులు ఆరాటపడుతున్నారు.

Ileana With Hero Ram After 12 Years-

ఇలియానా రీఎంట్రీ ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రంతో ఇవ్వబోతుంది. రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇక అమర్‌ అక్బర్‌ ఆంటోనీ విడుదల కాకుండానే ఈమెకు మరో ఛాన్స్‌ దక్కినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌తో ఈమె ఒక చిత్రంలో నటించబోతుంది.

ఇలియానా, రామ్‌లకు మొదటి చిత్రం ‘దేవదాస్‌’. ఆ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఈ జంట మళ్లీ ఇన్నాళ్లకు మరో సినిమాతో కలిసి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం హలో గురూ ప్రేమకోసమే అనే చిత్రంలో నటిస్తున్న రామ్‌ ఆ తర్వాత ఆర్‌ఎక్స్‌ 100 చిత్ర దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో ఒక చిత్రం చేయబోతున్నాడు. ఆ చిత్రం ఒక మల్టీస్టారర్‌ అంటూ వార్తలు వస్తున్నాయి. ఆ చిత్రంకు గాను ఒక హీరోయిన్‌గా ఇలియానను ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. పుష్కర కాలం తర్వాత రామ్‌, ఇలియానా కలిసి నటించబోతున్నారు. పెళ్లి అయిన తర్వాత కూడా ఇలియాన అంటే నిర్మాతలు మరియు దర్శకులు ఆమెపై తెగ మోజు పడుతున్నారు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.