హైదరాబాద్ లో కొంతమంది పూజారుల ప్రస్తుత పరిస్థితి ఇంత దయనీయంగా ఉందా.? వినాయక చవితి సమయంలో వెలుగులోకి.!   Hindu Priest Situation In Hyderabad     2018-09-26   10:19:18  IST  Sainath G

అది హైద్రాబాద్లోని ఓ బస్తీ…. బస్తీవాసులంతా కలిసి ఓ వినాయకుడిని పెట్టుకున్నారు. ఆ రోజు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసారు. వినాయకుడి పూజ నిమిత్తం అక్కడికి వచ్చాడు పరమేశ్వర శాస్త్రి. శుక్లాంబరధరం అనే శ్లోకంతో ప్రారంభించిన పూజను మంత్రపుష్పం సమర్పయామి అంటూ ముగించాడు. పూజ తర్వాత ప్రసాదం పంచే సమయంలో ప్రసాద్ పరమేశ్వర శాస్త్రిని చూసి. పరమేష్ నువ్వు అయ్యగారా? నీకు మంత్రాలు చదవడం కూడా వచ్చా అంటూ ఆశ్చర్యపోయాడు.

ఏంట్రా విషయం అని అంతలోనే పక్కనున్న నవీన్ ప్రసాద్ ను అడిగాడు… ఏం లేదురా రెండు వారాల క్రితం అనుకుంటా కూలీ పనికోసం నేను అడ్డామీద నిల్చున్న అంతలో ఎవరో ఇల్లు కడుతున్నాం ఇటుకలు మోయాలి అని మొత్తం 10 మందిని కూలీకి తీసుకెళ్లాడు. అందులో ఈయన కూడా ఉన్నాడు. పేరడిగితే పరమేష్ అన్నాడు. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఈయన ఇటుకలందిస్తుంటే నేను పైకి మోశాను. మద్యాహ్నం అన్నంలో నేను వేసిన మామిడికాయ పచ్చడి కూడా తిన్నాడు.అని చెప్పాడు.

ఇంతలో అవును నేను బ్రాహ్మణుడినే…అంటూ గొంతు విప్పాడు పరమేశ్వర శాస్త్రి. కడుపు మాడుతుంటే, పిల్లలు తిండికేడుస్తుంటే నా పాండిత్యం ఎక్కడా ఉపయోగపడలేదు. అందుకే హమాలి పని కోసం అడ్డా మీద కూలీగా మారాను. ఇదిగో ఈ వినాయక చవితి సమయంలో మా కుటుంబం ఆ ఆది దేవుడి పేరు చెప్పుకొని మూడు పూటల ఇంత తినగలుతున్నాం అంటూ సమాధానం ఇచ్చాడు.

వినాయక చవితికి అయ్యగార్ల కొరత ఉంటుంది అప్పుడే నాలాంటి చాలా మందికి పని దొరుకుతుంది. మా మంత్రాలు చదవడంలో కూడా పోటీ పెరిగిపోయింది. అందుకే బయటి గుడులలో కొత్త వారిని తీసుకోరు. ఉన్న బ్రాహ్మణులే వారి బంధువులను నియమించుకుంటారు. నీ మామిడికాయ పచ్చడిలో నాకు కులం కనిపించలేదు…ఆకలి తప్ప…… పరమేశ్వర శాస్త్రి అని చెప్పుకుంటే కూలీ పని కూడా దొరకదు అందుకే పరమేష్ గా పరిచయం చేసుకున్న.అంటూ చెప్పుకొచ్చాడు పరమేశ్వర శాస్త్రి.

ఈ మాటలు విన్న ఫ్రెండ్స్ యూత్ సభ్యులు ఆయన ఇచ్చిన ప్రసాదాన్ని కన్నీళ్లు కారుతున్న తమ కళ్లకద్దుకొని తిని…. కొత్త బట్టలతో పాటు 1000 రూపాయల దక్షిణ ఇచ్చి సాగనంపారు.