కారు.. ఎక్కబోతున్న మాజీ స్పీకర్ .. కాంగ్రెస్ లో కంగారు తప్పదా   Ex Speaker Suresh Reddy To Join In TRS     2018-09-07   13:49:57  IST  Sai M

ఇప్పటికే సవాలక్ష సమస్యలతో సతమతం అవుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. ఆ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్న కొంతమంది బలమైన నేతలకు టీఆర్ఎస్ పార్టీ గేలం వెయ్యడం కాంగ్రెస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలే దూకుడు మీద ఉన్న కేసీఆర్ అసెంబ్లీని రద్దు చెయ్యడంతో పాటు అభ్యర్థుల లిస్ట్ కూడా ప్రకటించి అన్ని పార్టీల్లో కాకరేపాడు. ఇప్పడు మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో కొంతమంది బలమైన నేతలను కారెక్కించుకునేందుకు సిద్ధం అవ్వడం.. దానిలో భాగంగా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ప్రకటన చెయ్యకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించడం కేసీఆర్ మార్క్ రాజకీయాలను తెలియజేస్తున్నాయి.

ఇప్పటికే టీఆర్ఎస్ ఆర్ధికంగా బలంగా ఉండడంతో తన ప్రత్యర్థి పార్టీలను మానసికంగా దెబ్బతీయాలని చూస్తోంది. కాంగ్రెస్‌లోని కీలక నేతలకు వల వేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పటికే పలువురు సీనియర్ నేతలతో టీఆర్‌ఎస్ మంతనాలు జరుపుతోంది. ఈనేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్ నేత, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డితో మంత్రి కేటీఆర్‌ సమావేశం అవడం కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది. కేటీఆర్‌ స్వయంగా సురేష్ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరపడం కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. సురేష్ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడం దాదాపు ఖాయమని రాజకీయ వర్గాలు చెబుతున్నారు. ఒకవైపు జానారెడ్డి నివాసంలో కాంగ్రెస్ నేతల సమావేశం జరుగుతుండగానే సురేష్ రెడ్డి ఇంటికి కేటీఆర్‌ వెళ్లడంతో ఇంకా ఎవరెవరికి టీఆర్ఎస్ వల వేయబోతోంది అనే ఆందోళనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

Ex Speaker Suresh Reddy To Join In TRS-

హుందాగా ఉండే రాజకీయ నేతల్లో సురేష్ రెడ్డి ఒకరు. ఎప్పుడు ఇవ్వదలకు దూరంగా ఉంటూ అధిష్ఠానం మాటే తన మాటగా ఉంటూ పార్టీలో మంచి పేరు సంపాదించుకున్నాడు సురేష్ రెడ్డి. వాస్తవానికి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కాంగ్రెస్‌ నాయకులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సురేష్ రెడ్డి వంటి నేతకు ఆ అవకాశం కల్పించి ఉంటే కాంగ్రెస్ కు మరింత ఉండేదని కొంతమంది లెక్కలు వేసుకుంటున్నారు. సురేష్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడం పై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసిందని, కొద్ది రోజుల్లోనే ఆయన కారెక్కడం ఖాయం అని ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకా ఎవరెవరు ఆ జాబితాలో ఉన్నారు అని లెక్కలు తేల్చేపనిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అయితే సురేష్ రెడ్డికి పార్టీలో సముచిత స్థానం ఇచ్చేందుకు కేటీఆర్ హామీ ఇచ్చాడని .. ఆ హామీతోనే ఆయన టీఆర్ఎస్ లో చేరుతున్నాడని తెలుస్తోంది.