మద్యం తాగొచ్చి బస్సులోని మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్.! చివరికి దిక్కున్న చోట చెప్పుకోమని.!   Drunk Police Constable Inappropriate Behavior Vinukonda Bus     2018-09-07   10:47:46  IST  Sainath G

ఆర్టీసీ బస్సులో నాగేశ్వర రావు అనే కానిస్టేబుల్‌ ఇద్దరు ఖైదీలను వెంటబెట్టుకొని ఎక్కాడు. అప్పటికే ముందు సీట్లలో కూర్చున్న ప్రయాణికులను లేవాలని కోరాడు. దానికి వారు నిరాకరించటంతో మర్యాదగా లేచి సీటు ఇవ్వకుంటే అంతు చూస్తానంటూ బెదిరించాడు. ఆ సమయంలో మరో ప్రయాణికుడు కలుగజేసుకోగా అతని చొక్కా పట్టుకొని దురుసుగా వ్యవహరించాడు. ఈ ఘటన గుంటూరు జిల్లా నరసరావు పేటలో బుధవారం జరిగింది.

నరసరావుపేట నుంచి వినుకొండ వెళ్లే ఆర్టీసీ బస్సులో ఓ కానిస్టేబుల్‌ ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. సీట్లో కూర్చొని ఉన్న మహిళా ప్రయాణికురాలిని సైతం అసభ్యపదజాలంతో దూషించాడు. ఇష్టారాజ్యంగా ప్రయాణికులతో వాదనకు దిగటంతో బస్సు డ్రైవర్‌ ప్రయాణికులకు సర్దిచెప్పి సీటు ఖాళీ చేయించి ఇప్పించాడు. పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని ప్రయాణికులు చెప్పినా అతను అలాగే ప్రవర్తించాడు. దిక్కున్నచోట చెప్పుకోమని కానిస్టేబుల్‌ బెదిరించాడు.

ప్రజలకు కాపాడే వృత్తిలో ఉండి..మద్యం తాగొచ్చి ఇంత నీచంగా ప్రవర్తిస్తాడా అంటూ ప్రయాణికులు వాపోయారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరి ఉన్నతాధికారులు పట్టించుకుంటారో లేదో చూడాలి.!