సీటు కష్టాలు ! కాంగ్రెస్ తో టీడీపీ తంటాలు     2018-08-20   09:30:41  IST  Ramesh Palla

తెలుగుదేశం పార్టీలో ఎన్నికల ముందే సీట్ల రగడ రాజుకుంది. కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు దాదాపు ఖాయం అయిపోయిన నేపథ్యంలో ఇక సీట్లు పంచుకోవడమే మిగిలిఉంది. అయితే పొత్తులో భాగంగా ఆ పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించాలి అనేది ఒక అవగాహనకు వచ్చినా .. ఎక్కడెక్కడ కేటాయించాలనే విషయం పై టీడీపీలో ఇంకా సరైన క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ మాత్రం తమకు గత ఎన్నికల్లో బాగా ఓట్లు వచ్చిన నియోజకవర్గాలను కోరుకుంటోంది. ఎక్కడయితే గెలుపు సులువు అవుతుందని ఆ పార్టీ ప్లాన్. అయితే కాంగ్రెస్ కోరుకుంటున్న స్థానాల్లో బలమైన టీడీపీ నేతలు ఉండడం వారు తమ స్థానాన్ని వదులుకునేందుకు సిద్ధంగా లేకపోవడం తదితర కారణాలు టీడీపీ కి తలనొప్పిగా మారింది. అయితే కాంగ్రెస్ మాత్రం ఆ సీట్ల విషయంలో వెనక్కి తగ్గకూడదనే నిర్ణయానికి వచ్చేసింది.

Chandrababu Headache With Congress-

Chandrababu Headache With Congress

వైసీపీ నుంచి టీడీపీలో వలస వచ్చిన ఎమ్యెల్యేల విషయంలోనే టీడీపీ నానా తంటాలు పడుతోంది. మరి కొన్ని సీట్లలో సిట్టింగుల మీద తీవ్రమైన వ్యతిరేకత ఉందని, చంద్రబాబు నాయుడు కొత్త వాళ్లను రంగంలోకి దించుతున్నాడు. అక్కడా రచ్చలు తప్పడం లేదు. అవి చాలవన్నట్టుగా ఇప్పుడు పదిహేను నుంచి ఇరవై సీట్లను కాంగ్రెస్ పార్టీకి కేటాయించడానికి చంద్రబాబు నాయుడు ఓకే చెప్పాడనే ప్రచారం తెలుగుదేశం పార్టీ లో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ లో ఇప్పటికీ మిగిలి ఉన్న మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు గతంలో పోటీ చేసిన సీట్లు, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల సీట్లు.. కాంగ్రెస్ పార్టీ కోరుకుంటోందట.

అయితే కాంగ్రెస్ డిమాండ్ తో తాము సీటు కోల్పోయే అవకాశం ఉందని టీడీపీ సిట్టింగ్ ఎమ్యెల్యేలు ఆందోళన చెందుతున్నారు. వీరి ఆందోళన విషయం పక్కనపెడితే టీడీపీ కి కాంగ్రెస్ తో పొత్తు ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరం. ఎందుకంటే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యం టీడీపీ ఎప్పుడూ చెయ్యలేదు. అందుకే ఇప్పుడు ఏ పార్టీతో పొత్తు అవకాశం లేకపోవడంతో కాంగ్రెస్ తో సై అంటోంది. కానీ సీట్ల కేటాయింపు విషయంలోనే కక్కలేక మింగలేక అన్నట్టు చూస్తోంది.కాంగ్రెస్ కి కేటాయించే స్థానాల్లో సొంత పార్టీ నేతలకు ఎలా సర్ది చెప్పాలో తెలియక సతమతం అవుతోంది.