రాఖీకి ఇంటికి రాలేక...ఓ చెల్లికి అన్న పంపిన ఈ మెసేజ్ చూస్తే కన్నీళ్లొస్తాయి.! కానీ చివరి లైన్ చూస్తే నవ్వాపుకోలేరు.!     2018-08-26   09:18:06  IST  Sai Mallula

చెల్లమ్మా ఐ మిస్ యూ రా…

రాఖీ పండుగ రోజు ఇంటికి రావాలని, నీ చేతితో రాఖీ కట్టించుకోవాలని చాలా ఉందిరా. కానీ ఏం చేస్తాం.. సాఫ్ట్ వేర్ అంటూ వచ్చి ఇక్కడ తెల్లోల దేశంలో సెటిల్ అవ్వాల్సి వచ్చింది. రాఖీ పండగ అనగానే.. నువ్వు నా చేతికి పూరీ సైజంత పెద్ద రాఖీని కట్టిన రోజులే గుర్తొస్తాయ్. ఇక మన వీధిలో ఇందు, రేణు, ప్రభా,సద్దు,రజిత లు మణికట్టు నుండి మోచేతి వరకు కట్టిన రాఖీలు , రాఖీ కడుతూ వారు తినిపించిన మైసూర్ పాక్ లే గుర్తొస్తాయ్. కట్టిన రాఖీలు విప్పకుండా తెల్లారి అలాగే స్కూల్ కు వెళ్లి.. ఎవరి చేతికి ఎక్కువ రాఖీలు ఉన్నాయోనని లెక్కలేసుకొని మరీ ఆనందించే వాళ్లం.. ఎక్కువ రాఖీలున్నోడు గొల్డ్ మెడల్ సాధించినంత సంతోషంగా ఫీలయ్యేవాడు.

Brother Letter To Sister About Missing Rakhi Purnima Festival-

Brother Letter To Sister About Missing Rakhi Purnima Festival

నువ్వు నేను.. చిన్నప్పుడు తలగడతో కొట్టుకున్న రోజులు, సైకిల్ మీద నిన్ను ఎక్కించుకొని స్కూల్ కు తీసుకెళ్లిన రోజులు.. నాన్న తెచ్చే పీచు మిఠాయి కోసం మనం తనుకున్న రోజులు, నాన్న పర్సు లోంచి 2 రూపాయలను దొంగలించి నీకు అర్థరూపాయి ఇచ్చి నేను రూపాయిన్నర కొట్టేసిన రోజులు …. ‘టీ’ కోసం కట్టెల పొయ్యి దగ్గర కొట్టుకున్న మన రెండు గ్లాసులు. బెట్ పెట్టి మరీ అష్టాచెమ్మా ఆడిన రోజులు ….ఇలా ఒక్కొక్కటి కళ్లముందు కదులుతున్నాయ్ రా..! ఇలా రాస్తుంటే నా కంటి వెంట నీళ్లు కారుతున్నాయ్ రా..!

ఊహ తెలియని వయస్సులో ఎదురింటి సరోజాకు నేను రాసిన ప్రేమలేఖలు మోసిన ఫోస్ట్ ఉమెన్ నువ్వే. నా బి.టెక్ సంప్లిమెంటరీ ఫీజు కోసం నీ చేతికున్న బంగారు గాజులమ్మి, పోయాయని అబద్దం చెప్పి అమ్మ చేతిలో దెబ్బలు తిన్న రోజు నాకింకా గుర్తే. నీ పెళ్లి అప్పగింతల్లో నన్ను పట్టుకొని అన్నా…అన్నా… అని నువ్వు ఏడుస్తుంటే.. నీ కంటి నుండి కారిన కన్నీటి ఆవిరిలో నీకు నామీదున్న ఆపాయ్యత తాలుకూ వేడి నన్నూ ఏడిపించింది. నా కొడుక్కి అన్నీ మామ పోలికలే ఒచ్చాయ్ అని నువ్వు గర్వంగా చెప్పుకుంటుంటే.. నీకు అన్నగా పుట్టినందుకు ఈ జన్మ ధన్యమనిపిస్తుంది.

ఈ జీవితానికి ఇది చాలమ్మా ! నిన్ను నాకు చెల్లిగా పుట్టించిన భగవంతుడికి దండాలు రా.. బంగారం.! వచ్చే రాఖీ కి తప్పకుండా వస్తా… నా ఫీజుకోసం నువ్వు త్యాగం చేసిన గాజులకు.. చక్రవడ్డీ కలుపుకొని మరీ మా అల్లుడికి హగ్గీస్ పాకెట్ తెస్తా!

నీ అన్న- అన్నవరం.