అతను ఒకప్పుడు పశువుల కాపరి..ఇప్పుడు ఒక కాలేజికి ప్రిన్సిపల్..  

జీవితంలో కష్టాలనేవి మనల్ని బాదపెట్టడానికి రావు..ఎలా బతకాలో నేర్పడానికి వస్తాయి..కాబట్టి మనకు వచ్చే ప్రతి కష్టం మనకొక పాఠం కావాలి తప్ప మనల్ని వెనక్కి లాగకూడదు..ఈ సిద్దాంతాన్నే నమ్మారు రామకోటి..పదో తరగతి ఫెయిల్ అయ్యి పశువుల కాపరిగా కుదిరిన ఆయన అప్పుడు అక్కడే ఆగిపోయుంటే ఈ రోజు మనం అతనిగురించి ఇలా చెప్పుకునేవాళ్లం కాదేమో..ఓటమి అనేది మన విజయానికి తొలిమెట్టు..అలాంటి ఎన్నో మెట్లు ఎక్కిన రామకోటి జీవితం గురించి తెలుసుకుంటే కష్టాలకు భయపడకుండా జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలనేది తెలుస్తుంది.

Abhyudaya Oriental College Pricipal Ramakoti Life Story-

Abhyudaya Oriental College Pricipal Ramakoti Life Story

ఎక్కడ జోగ్యానాయక్ తండా.. ఎక్కడ జియాగూడ అభ్యుదయ ఓరియెంటల్ కాలేజీ. పేరు రాయడం వస్తే చాలనుకున్న చదువు.. పీహెచ్డీ చేసి, ఓ కాలేజీ ప్రిన్సిపల్ అయ్యేదాక వెళ్లింది.ప్రస్తుత జనగామ జిల్లా కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి దగ్గర జోగ్యానాయక్ తండాలో పుట్టి పెరిగారు రామకోటి. తరతరాలుగా ఎద్దు, వ్యవసాయమేనా? గిరిజన కుటుంబంలో పుట్టినంత మాత్రాన చదువుకు దూరంగా బతకాల్సిందేనా? అని నిరంతరం బాదపడే రామకోటి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నారు.ఆ గుర్తింపు రావాలంటే చదువొక్కటే మార్గమని బలంగా నమ్మారు..అనుకున్నదే తడవుగా ప్రభుత్వ పాఠశాలలో చేరారు. తండానుంచి 8 కిలోమీటర్లు దూరంలో ఉన్న చెన్నూరు హైస్కూల్ కి రోజు పదహారు కి.మి చొప్పున నడిచేవారు. 1978లో టెన్త్ క్లాస్ పరీక్షలు రాసిన రామకోటికి తొలిసారి నిరాశ ఎదురైంది.పదోతరగతి ఫెయిల్ అయ్యారు.ఎంత ఉత్సాహంగా పనిచేశారో,అంతకు రెట్టింపు నిరుత్సాహం ఆవరించింది.అంతే పనికి కుదిరారు.ఆఖరికి పశువులు మేపడం పని కూడా చేశారు.

ఊర్లో ఉండి ఇంక ఏం చేయలేక హైదరాబాద్ పోయి ఏదన్నా పనికి కుదరొచ్చని హైదరాబాద్ బస్సెక్కారు. పాతబస్తీ దారుస్సలాంలో ఓ ఆయిల్ మిల్లులో పనికి కుదిరి. పొద్దున 8 గంటల నుంచి రాత్రి 8వరకు డ్యూటీ … అక్కడ కొంతకాలం చేసిన తర్వాత, బాలానగర్ లోని ఓ స్క్రాప్ కంపెనీలో ఇంకో ఉద్యోగం. నెలకు జీతం రూ.150. కాలం గిర్రున తిరిగింది. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ధ్యాస చదువు మీదకి మళ్లింది. 1982లో టెన్త్ పాసయ్యారు. రిజల్ట్ చూసుకున్న తర్వాత ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. పెట్టేబేడా సర్దుకుని మళ్లీ బ్యాక్ టు హోం…

Abhyudaya Oriental College Pricipal Ramakoti Life Story-

మళ్లీ నిరాశే. ఇంటర్లో సీటు దొరకలేదు. స్టేషన్ ఘన్ పూర్ లో కొత్తగా గవర్నమెంటు కాలేజీ స్థాపించడంతో అదృష్టం కొద్దీ సీట్ కన్ఫమ్ అయింది. ఆ కాలేజీలో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేశారు. అంతా బానేవుంది కానీ, ఇంటికి కాలేజీకి దూరం కావడంతో చదువు కష్టంగా మారి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. చేసేదేంలేక సెకండ్ ఇయర్ నెల్లికుదురు గవర్నమెంటు జూనియర్ కాలేజీలో . ఎందుకంటే అక్కడికి ఐదారు కిలోమీటర్ల దూరంలో రామకోటి వాళ్ల అక్క ఉంటుంది. ఆమె సలహాతోనే సెకండ్ ఇయర్ కాలేజీ మారి,అక్క వాళ్ల దగ్గరుండి చదువుకున్నారు. ఎగ్జామ్స్ రాసి ఫలితాలు వచ్చేలోపు ఖాళీగా వుండలేక నెలకు రూ. 550 జీతానికి, కొండకండ్లలో వయోజన విద్యాకేంద్రంలో సూపర్ వైజర్ గా చేరారు.ఈలోపు ఇంటర్ రిజల్ట్ వచ్చి ఇంటర్ పాస్ కావడంతో 1985లో డిగ్రీ కోసం మళ్లీ పట్నం వచ్చి… ఏవీ కాలేజీలో డిగ్రీలో చేరారు. అక్కడ ఈవెనింగ్ క్లాసులు కావడంతో పొద్దంతా ఉద్యోగం సాయంత్రం కాలేజికి వెళ్లేవారు.. నారాయణగూడ విఠల్ వాడీలోని ఓ ప్రైవేటు కంపెనీలో డెలివరీ బోయ్ గా పనిచేసేటప్పుడే రామకోటికి పెళ్లి జరిగింది. భార్యాభర్తలం ఇద్దరు పనిచేస్తేగానీ బతుకు బండి నడిచేది కాదు.

ఈ సారి అదృష్టం రామకోటి తలుపు తట్టింది. రెండేళ్ల తర్వాత 1987లో దక్షిణమధ్య రైల్వేలో జాబ్ వచ్చింది. లాలాగూడ లోకో షెడ్ లో హెల్పర్ జాబ్. ఉద్యోగమైతే వచ్చింది కానీ..రామకోటికి ఆ జీవితం సంతృప్తిని ఇవ్వలేదు. జీవితం ఇది కాదేమో అనిపించి ఇంకా చదువుకోవాలన్న తపన చల్లారలేదు.. డిగ్రీ తర్వాత 1990-92లో ఎమ్ఏ హిందీ,1992 దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడెమీలో స్టోర్ కీపర్ గా ఇంకో అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఆ నౌకరీ చేస్తూనే 1995లో పీహెచ్డీ కంప్లీట్ చేశారు. బంజారా జానపద గీతాలపై పరిశోధన. 1999లో జియాగూడ అభ్యుదయ ఓరియెంటల్ ఈవెనింగ్ కాలేజీలో హిందీ టీచర్ గా అవకాశం వచ్చింది. అనుకున్న లక్ష్యం వైపే ప్రయాణిస్తున్నానని అప్పుడనిపించింది. ఆ ఊపులోనే ఓయూ నుంచి ఎల్ఎల్ఎం, ఎల్ఎల్బీ కూడా కంప్లీట్ చేశారు.

Abhyudaya Oriental College Pricipal Ramakoti Life Story-

2015లో కాలేజీ ఇంచార్జ్ ప్రిన్సిపల్ గా అవకాశం ఇచ్చారు..ఇచ్చారు అనేకంటే తనే సవాల్ గా ఆ బాద్యతను తీసుకున్నారు అని చెప్పాలి. ఎందుకంటే ఆ కాలేజీ పరిస్థితి అలాంటిది.. కనీస మౌలిక సదుపాయాలు లేవు. కూచోడానికి బెంచీలు లేని దుస్థితి. పేరులో ఉన్న అభ్యుదయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపించాలని కంకణం కట్టుకుని ముందుగా మౌలిక వసతుల మీద దృష్టి పెట్టి… టాయిలెట్స్ నిర్మాణం దగ్గర్నుంచి నాన్ టీచింగ్ స్టాఫ్ దాకా అన్నింటా ముందు నడిచి, కాలేజీకి ఓ రూపు తెచ్చారు. యూజీసీ ఇచ్చిన కొన్ని నిధులతో కళాశాల రూపురేఖల్నే మార్చేశారు.పాడుబడ్డ బంగళాలా ఉన్న భవంతిని అధునాతన ఇంజినీరింగ్ కాలేజీలా తీర్చిదిద్ది… లైబ్రరీని ఆధునీకరించి… పై అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగి, బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయించి… పదిహేను కంప్యూటర్లు తెప్పించి లాబ్ ను మెరుగుపరిచి…ఒకటేమిటి ఆ కాలేజికి కావలసిన అన్ని సదుపాయలు కల్పించడంలో కృషి చేశారు. కలలో కూడా ఊహించని విధంగా కాలేజీని తీర్చిదిద్దినందుకు మంచి గౌరవమే దక్కింది. జియాగూడలో ఇంత అద్భుతమైన కాలేజీ వుందా అని అందరూ అబ్బురపడేలా చేయడంలో రామకోటి కృషి మరువలేనిది.

రామకోటి గురించి చదివే ప్రతి ఒక్కరికి ఒకటి అనిపిస్తుంది.. చదువు అనేది మనిషికి ఎంత అవసరమో. అందుకే రామకోటి చెప్పేది ఒక్కటే.. కూలి పనిచేసైనా, పస్తులుండైనా సరే చదువుకోవాలి అని. చదువే అన్నిటికి మూలం. బడి అంటే నా దృష్టిలో దేవాలయం అంటారు రామకోటి. చదువే మనిషి ఉన్నతికి మార్గం. చదువుకున్నవాడే నాకు ఆరాధ్యుడు.. ఆత్మీయుడు.. రామకోటి మాటలు అక్షరసత్యాలు..అక్షరం మనతోడుంటేనే మనం బతకగలం,పదిమందిని బతికించగలం… ఎక్కడ పశువుల కాపరి..ఎక్కడి కాలేజి ప్రిన్సిపల్..ఇదంతా జరిగిందంటే కేవలం చదువు వలనే…