మరో కొత్త పార్టీ పుట్టింది     2015-04-15   09:43:41  IST  Bhanu C

దేశంలో మరో కొత్త పార్టీ పుట్టింది. ఎమర్జెన్సీ తరువాత కొన్ని పార్టీల కలయికతో ‘జనతా పార్టీ’ పుట్టినట్లుగా ఇప్పుడు ఆరు పార్టీల కలయికతో ‘జనతా పరివార్‌’ జన్మించింది. ఇది భాజపాకు, కాంగ్రెసుకు ప్రత్యామ్నాయం అవుతుందని అనుకుంటున్నారు. ములాయం సింగ్‌ సమాజ్‌వాదీ పార్టీ, లాలూ ప్రసాద్‌ యాదవ్‌ రాష్ర్టీయ జనతాదళ్‌, మాజీ ప్రధాని దేవెగౌడ జనతాదళ్‌ ఎస్‌, నితీష్‌ కుమార్‌ జేడీయూ, ఇండియన్‌ లోక్‌దళ్‌, సమాజ్‌వాదీ జనతా పార్టీ…పార్టీలు కలిసి జనతా పరివార్‌గా రూపాంతరం చెందాయి. కొత్త పార్టీకి ములాయం సింగ్‌ యాదవ్‌ అధిపతిగా ఉంటారు. వచ్చే ఏడాది జరగబోయే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జనతా పరివార్‌ మొదటిసారిగా పోటీ చేయనుంది. నితీష్‌, గౌడ్‌, లాలూ ఇతర నాయకులు బుధవారం ఢిల్లీలో సమావేశమై కొత్త పార్టీ పుట్టుకను ప్రకటించారు. మంగళవారం అంబేద్కర్‌ జయంతి రోజు భాజపా బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడంతో ఈ నాయకులకు చురుకు పుట్టినట్లుంది. వెంటనే పార్టీని ప్రకటించకపోతే అసలుకే ఎసరు వస్తుందనుకున్నారేమో…! ఆరు పార్టీల కలయికను భాజపా తేలిగ్గా తీసుకుంది. బీహార్‌ ఎన్నికల్లో జనతా పరివార్‌ గెలిస్తే భాజపాకు దడ పుట్టడం ఖాయం.