లక్షలు రావడమే కష్టంగా ఉంది.. 375 కోట్లు ఎలా గురూ!     2018-07-06   00:56:29  IST  Raghu V

ప్రస్తుతం వెబ్‌ సిరీస్‌ల హవా కొనసాగుతుంది. తెలుగు ప్రేక్షకుల ముందుకు ఇప్పటి వరకు ఎన్నో వెబ్‌ సిరీస్‌లు వచ్చాయి. తెలుగు ప్రేక్షకులను మొదట పలకరించిన నిహారిక తన రెండవ వెబ్‌ సిరీస్‌ను కూడా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం జరిగింది. ఇంకా ఎంతో మంది స్టార్స్‌ కూడా వెబ్‌ సిరీస్‌లపై మోజు పడుతున్నారు. ప్రస్తుతం సినిమాల స్థాయిలో భవిష్యత్తులో వెబ్‌ సిరీస్‌లకు ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకే వెబ్‌ సిరీస్‌లను వరుసగా తీస్తున్నారు.

ఈ క్రమంలోనే ‘బాహుబలి’ మేకర్స్‌ శివగామి పాత్ర నేపథ్యంలో ఒక భారీ వెబ్‌ సిరీస్‌ను ప్లాన్‌ చేస్తున్నారు. ‘బాహుబలి’కి ప్రీ క్వెల్‌ అన్నట్లుగా ఈ వెబ్‌ సిరీస్‌ ఉంటుందని సమాచారం అందుతుంది. ‘శివగామి’ టైటిల్‌తో భారీ ఎత్తున రూపొందబోతున్న ఈ వెబ్‌ సిరీస్‌ను లాంచనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ వెబ్‌ సిరీస్‌ కోసం ఆర్కా మీడియా ఏకంగా 375 కోట్లను ఖర్చు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేయడం వెబ్‌ సిరీస్‌ల చరిత్రలోనే మొదటిసారి అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు. ఇప్పటి వరకు వచ్చిన వెబ్‌ సిరీస్‌లు అన్ని కూడా లక్షల బడ్జెట్‌తోనే వచ్చాయి.

‘శివగామి’ వెబ్‌ సిరీస్‌ ఏకంగా 375 కోట్ల బడ్జెట్‌ అంటే అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. లక్షల రూపాయలు పెట్టి తీస్తేనే చూసే దిక్కు లేదు. కొందరు పెట్టిన పెట్టుబడి కూడా రాబట్టలేక పోతున్నారు. వెబ్‌ సిరీస్‌లకు ఇండియాలో ఇంకా అంత భారీ స్థాయిలో ఆధరణ లేదు. యూట్యూబ్‌లో ఫ్రీగా వస్తే వీడియోలను చూస్తారు, కాని డబ్బులు చెల్లించి వీడియోలు చూసే వారి సంఖ్య ఇండియాలో చాలా అంటే చాలా తక్కువ. అందుకే శివగామి వెబ్‌ సిరీస్‌కు అంత బడ్జెట్‌ పెట్టడం వృదా ప్రయాస అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఆర్కా మీడియా వారు మాత్రం తమ వెబ్‌ సిరీస్‌తో సంచలనం నమోదు చేసేందుకు సిద్దం అవుతున్నారు. తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ వెబ్‌ సిరీస్‌ను విడుదల చేయబోతున్నారు. ఇక ఎన్నో దేశాల్లో కూడా ఈ వెబ్‌ సిరీస్‌ను ప్రైమ్‌ మీడియోగా విడుదల చేయబోతున్నారు. బాహుబలితో తెలుగు సినిమా స్థాయిని మార్చేసిన ఆర్కా మీడియా ఇప్పుడు వెబ్‌ సిరీస్‌ల తీరును మొత్తం మార్చేందుకు సిద్దం అయ్యింది. ఈ వెబ్‌ సిరీస్‌కు రాజమౌళి దర్శకత్వ పర్యవేక్షణ చేయనున్నాడు. ఇద్దరు లేదా ముగ్గురు ఈ వెబ్‌ సిరీస్‌కు దర్శకత్వ బాధ్యతలు తీసుకోనున్నారు. ఎన్ని పార్ట్‌లుగా ఇది ప్రసారం అవుతుందనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.