కారు పార్టీకి పంచర్లు వేస్తున్న 'గులాబీ ముళ్లు'       2018-07-08   01:44:41  IST  Bhanu C

ఎన్నికల గట్టు ఎక్కేందుకు స్పీడ్ పెంచిన కారు పార్టీ కి నేతల తీరు కంగారు పెట్టిస్తోంది. రాబోయే ఎన్నికల్లో గెలిచి తీరాలని కసి పెంచుకుని మరీ కష్టపడుతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి ఆ పార్టీ నాయకులు మనసున్నతి లేకుండా చేస్తున్నారు. నిత్యం ఎదో ఒక నాయకుడు, నాయకురాలి గురించి వివాదం రావడం దాన్ని చక్కదిద్దేలోపు మరో వివాదం చుట్టుకోవడం ఆ పార్టీని కంగారు పెట్టిస్తోంది. ఈ తలపోట్లు అన్ని భరించలేక నాయకులను గట్టిగా మందలించలేక కేసీఆర్ లోలోపల మధనపడుతున్నారు. తాజాగా టీఆర్‌ఎస్‌ ఎంపీ సుమర్‌పై వచ్చిన ఆరోపణల్లో నిజం ఎంతుందో కానీ పార్టీ పరువు మాత్రం తీశాయి.

టీఆర్ఎస్ లో నేతల మధ్య ఆధిపత్య పోరు, నాయకుల అత్యుత్సాహం అధికార పార్టీకి ఇబ్బందులు సృష్టిస్తోంది. ఒక్కో జిల్లాల్లో ఒక్కో రకమైన ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. గత నాలుగు సంవత్సరాలుగా అక్కడక్కడా వివాదాలు వెలుగు చూస్తున్నా…ఇటీవల నేతల వ్యవహార శైలి మరీ ముదిరిపోయింది. ఆధిపత్యం కోసం ఒక నేత, అధికార పార్టీ అన్న ధీమాతో మరో నేత, వ్యక్తి గత వ్యవహార శైలితో ఇంకొక నేత వ్యవహరిస్తుండడం…. కేసీఆర్ కి ఆగ్రహం తెప్పిస్తోంది.

అవిశ్వాస తీర్మానం విషయంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీఆర్ఎస్ నేతల్లో చర్చనీయంశంగా మారాయి. మరుసటి రోజే యువనేత ఎంపీ సుమన్ పై మహిళా పాత్రికేయులు ప్రధానికి ఫిర్యాదు చేసారన్న విషయం బయటపడడంతో అధికార పార్టీలో వ్యవహారం హాట్ హాట్ గా మారింది. కేసిఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే నేతల్లో ఒకరిగా గుర్తింపు పొందిన సుమన్ మహిళలను లైంగికంగా వేధించడాన్న ఫిర్యాదులపై పార్టీ కూడా అప్రమత్తమైంది. ఫోటోలను మార్ఫింగ్ చేసి బ్లాక్ మేయిలింగ్ కు పాల్పడ్డారని పోలీసు అధికారులు వెల్లడించడం వెనుక వ్యూహం ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

న‌గర శివారుల్లో ఓ భూ సెటిల్ విషయంలో అదే జిల్లాకు చెందిన మంత్రి, ఎమ్మెల్యేకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందన్న ప్రచారం జరుగుతోంది. మంత్రి ఎమ్మెల్యేకు అనుకూలంగా వ్యవహరించకపోవడంతో సదరు ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ….తన పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమన్న ప్రకటన చేసినట్లు వార్తలు బయటకి రావడంతో అధికార పార్టీ కంగారుపడుతోంది. పార్టీని పరుగులుపెట్టించాలని అధినేత చూస్తుంటే.. నాయకులు మాత్రం ఆ ఆశలను అడియాసలు చేసేస్తున్నారు.