సైరా విషయంలో అతి..       2018-06-01   23:10:49  IST  Raghu V

మెగాస్టార్‌ చిరంజీవి ‘ఖైదీ నెం.150’ చిత్రం తర్వాత చేస్తున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంకు సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నాడు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు రచన సహకారంను పరుచూరి బ్రదర్స్‌ అందిస్తున్నారు. భారీ యుద్ద సన్నివేశాలు, భారీ సెట్టింగ్స్‌లో ప్రముఖ తారాగాణం సమక్షంలో సీన్స్‌ను తెరకెక్కిస్తున్న కారణంగా సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. సినిమా ప్రకటించిన తర్వాత సెట్స్‌ పైకి వెళ్లడానికి దాదాపు సంవత్సరం పట్టింది. ఆ సంవత్సరం పాటు స్క్రిప్ట్‌ వర్క్‌ అంటూ జరుపుతూ వచ్చారు.

సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. మొదటి నుండి ఈ చిత్రంను 2018 చివర్లో లేదా 2019 సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లుగా చెబుతూ వచ్చారు. ఎట్టకేలకు ఈ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చింది. 2019 సంక్రాంతికి కూడా రావడం లేదని, అదే సంవత్సరం వేసవిలో విడుదల చేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దాదాపు రెండు సంవత్సరాలకు పైగా ఈ సినిమా పడుతుంది. ఇంత భారీగా ఏం చేస్తున్నారు, ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నారు అంటూ సినీ వర్గాల వారు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి ఖైదీ నెం.150 సినిమా ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడుతూ ఇదే సంవత్సరంలో మరో రెండు సినిమాలను చేసి, అభిమానులకు వినోదాన్ని పంచుతాను అంటూ హామీ ఇచ్చాడు. అదే సంవత్సరం అంటే 2017లో రెండు సినిమాలు కాదు కదా, కనీసం ఒక్క సినిమాను కూడా విడుదల చేయలేక పోయాడు. 2017 పోయి 2018 వచ్చింది. ఈ సంవత్సరంలో కూడా ఒక్కటి అంటే ఒక్కటి కూడా విడుదల చేయలేక పోయాడు. 2019 సమ్మర్‌ కానుకగా సైరా రాబోతుంది. అంటే రెండున్న సంవత్సరాలు గ్యాప్‌ తీసుకుంటున్నాడన్నమాట. గతంలో సంవత్సరంలో పదికి పైగా సినిమాలు చేసి సూపర్‌ హిట్స్‌ను దక్కించుకున్న చిరు ఇప్పుడు సంవత్సరంలో ఒకటి కాదు కదా, రెండు సంవత్సరాలకు ఒకటి కూడా విడుదల చేయలేక పోతున్నాడు.

భారీ సినిమా, భారీ బడ్జెట్‌ అంటూ సైరా సినిమా విషయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు కాస్త అతి చేస్తున్నారు అని, దర్శకుడు సురేందర్‌ రెడ్డి క్లారిటీ లేకుండా సినిమాను ముందుకు నడిపిస్తున్నాడు. ఒక పక్కా ప్లానింగ్‌ లేకపోవడం వల్లే ఇంత ఆలస్యం అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇలా ఒక్క సినిమాకే ఇంత సమయం కేటాయిస్తే ఎలా అంటూ చిరంజీవి ఫ్యాన్స్‌ మరియు సన్నిహితులు ప్రశ్నిస్తున్నారు. చిరు కూడా ఈ సినిమాకు ఇంత సమయం పడుతుందని భావించలేదు అని, మొదలు పెట్టిన తర్వాత ఇలా అవుతుందని ఆయన సన్నిహితులు చెబుతూ వస్తున్నారు.