సైరా మూవీ శృతి మించుతోంది       2018-04-28   01:00:58  IST  Raghu V

మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ కోసం మెగా ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రానికి సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నాడు. చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెం.150 భారీగా వసూళ్లు సాధించింది. ఆ కారణంగానే సైరాను మొదట 100 కోట్లకు పైబడిన బడ్జెట్‌తో నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అందుకు తగ్గట్లుగా స్క్రిప్ట్‌ను రెడీ చేయడం జరిగింది. కాని స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి అయిన తర్వాత బడ్జెట్‌ అమాంతం పెరిగి పోయింది.

చిరంజీవి సినిమా అవ్వడంతో పాటు పలువురు స్టార్స్‌ ఈ చిత్రంలో నటిస్తున్న కారణంగా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అందుకే ఈ చిత్రాన్ని ఎంత బడ్జెట్‌తో తెరకెక్కించినా వర్కౌట్‌ అవుతుందని సినీ వర్గాల వారు భావించారు. దాంతో 150 కోట్ల వరకు బడ్జెట్‌ పెట్టబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. ఒక తెలుగు సినిమా 150 కోట్ల బడ్జెట్‌ అంటే మామూలు విషయం కాదు. ఒక్క తెలుగులోనే ఇంత బడ్జెట్‌ను రికవరీ చేయడం అసాధ్యం అని అంతా అనుకుంటున్నారు. ఈ సమయంలోనే ఈ చిత్రం బడ్జెట్‌ మరింతగా పెరిగిందని సినీ వర్గాల వారు అంటున్నారు.

సైరా చిత్రంలో కొన్ని కీలక సన్నివేశాలను అత్యంత ఖరీదైన ఏరియాలో చిత్రీకరించాలని భావిస్తున్నారు. అందుకోసం భారీ ఎత్తున జనాలు కావాల్సి ఉంటుందని, యుద్ద సన్నివేశాలను సహజంగా చిత్రీకరించాలని భావిస్తున్నారు. అందుకే ఈ చిత్రం బడ్జెట్‌ను 150 నుండి 175 కోట్లకు పెంచాలని నిర్ణయించినట్లుగా సమాచారం అందుతుంది. మెగాస్టార్‌ చిరంజీవి సినిమా అంటే క్రేజ్‌ బాగానే ఉంటుంది. కాని ఏకంగా 175 కోట్ల బడ్జెట్‌ అంటే అది చాలా పెద్ద సాహసం అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రామ్‌ చరణ్‌ ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నాడు. బాహుబలి మొదటి పార్ట్‌ కలెక్షన్స్‌ను బీట్‌ చేస్తుందనే నమ్మకంతో ఇంత బడ్జెట్‌ను ఖర్చు చేసేందుకు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సినిమా పూర్తి అయ్యే సమయానికి బడ్జెట్‌ ఏకంగా 200 కోట్లకు చేరిన ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమితాబచ్చన్‌, విజయ్‌ సేతుపతి, నయనతార, జగపతిబాబు, తమన్నా ఇంకా పలువురు స్టార్స్‌ ఈ చిత్రంలో నటిస్తున్నారు. బాలీవుడ్‌, కోలీవుడ్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.