శ్రీనువైట్లకు భయంగా ఉందేమో?       2018-06-07   00:45:54  IST  Raghu V

చిన్న చిత్రాలతో దర్శకుడిగా పరిచయం అయ్యి, కొంత కాలానికే స్టార్‌ డైరెక్టర్‌గా పేరు దక్కించుకున్న శ్రీనువైట్ల గత కొంత కాలంగా వరుసగా ఫ్లాప్‌ అవుతూ వస్తున్నాడు. ‘దూకుడు’ చిత్రం తర్వాత ఇప్పటి వరకు శ్రీనువైట్లకు సక్సెస్‌ దక్కింది లేదు. చేసిన చిత్రాలన్ని కూడా బాక్సాఫీస్‌ వద్ద మామూలుగా కూడా కాకుండా భారీ డిజాస్టర్స్‌గా నిలిచాయి. భారీ ఎత్తున ఆ చిత్రాలు అట్టర్‌ ఫ్లాప్‌ అయినా కూడా ఈయనతో సినిమాను చేసేందుకు రవితేజ ముందుకు వచ్చాడు. ప్రస్తుతం రవితేజతో ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’ చిత్రాన్ని శ్రీనువైట్ల తెరకెక్కిస్తున్నాడు.

రవితేజతో సినిమాను భారీ బడ్జెట్‌తో శ్రీనువైట్ల ప్లాన్‌ చేశాడు. గత చిత్రాలు ఫ్లాప్‌ అయినా కూడా ఈయన ఏమాత్రం నిరుత్సాహం చెందకుండా అమెరికాతో పాటు ఖరీదైన లొకేషన్స్‌లో సినిమాను తెరకెక్కించేందుకు సిద్దం అయ్యాడు. ఈ చిత్రానికి పారితోషికం తీసుకోకుండా నిర్మాణ భాగస్వామిగా శ్రీనువైట్ల ఉన్నాడు. మొదట సినిమాకు భారీగా ఖర్చు చేయాలని భావించిన శ్రీనువైట్ల ఇప్పుడు కాస్త టెన్షన్‌ పడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇటీవల రవితేజ నటించిన రెండు చిత్రాలు విడుదలై బాక్సాఫీస్‌ ముందు బొక్క బోర్లా పడ్డాయి. దాంతో ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి లేదు. ఆ కారణంగానే సినిమా బిజినెస్‌ అవుతుందో కాదో అనుమానంతో బడ్జెట్‌ను కుదించే ప్రయత్నాలు చేస్తున్నాడు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 5 కోట్ల బడ్జెట్‌తను తగ్గించాలని నిర్ణయించుకున్నాడు. అందుకు సంబంధించిన అమెరికా షెడ్యూల్‌ను కూడా కుదించాడని, దాంతో పాటు సినిమాను ఎక్కువ శాతం హైదరాబాద్‌లోనే చేసేయాలని భావిస్తున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలు హైదరాబాద్‌ పరిసర ప్రాంతంలో జరుగుతున్నాయి. ముందుగా అనుకున్న ప్రకారం ఇప్పటికే అమెరికా వెళ్లాల్సి ఉంది. దాదాపు 45 రోజుల పాటు అక్కడ షూటింగ్‌కు ప్లాన్‌ చేశారు. కాని 45 రోజులను కాస్త కేవలం 20 రోజులకు కుదించారు.
కీలక సన్నివేశాలను మాత్రమే అక్కడ చేయాలని భావిస్తున్నారు. అందుకోసం కథలో చిన్న చిన్న మార్పులు, చేర్పులు కూడా శ్రీనువైట్ల చేసినట్లుగా తెలుస్తోంది. రవితేజతో సినిమాను కేవలం 20 కోట్లతో తీస్తేనే సేఫ్‌. కాని అమర్‌ అక్బర్‌ ఆంటోనీ చిత్రాన్ని 30 కోట్లకు పై చిలుకు బడ్జెట్‌తో శ్రీనువైట్ల ప్లాన్‌ చేశాడు. తాజాగా 5 కోట్ల కాస్ట్‌ కట్టింగ్‌ చేసి 25 కోట్లకు ఫైనల్‌గా చేశాడు. ఈ సినిమా మినిమంగా ఆడినా కూడా 20 కోట్ల వరకు వచ్చేస్తుందనే నమ్మకంతో సినీ వర్గాల వారు ఉన్నారు. శ్రీనువైట్ల గత చిత్రాల మాదిరిగా కాకుండా ఈ చిత్రంను ప్రత్యేకంగా తెరకెక్కిస్తున్నట్లుగా చెబుతున్నాడు. రవితేజ మూడు విభిన్న పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో ఇద్దరు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. ఇలియానా మరియు శృతిహాసన్‌లు సినిమాకు అందం తీసుకు వస్తారని చిత్ర యూనిట్‌ సభ్యులు అంటున్నారు.