శతమానం స్థాయిలో ఉండదని తేలిపోయింది       2018-05-19   02:23:53  IST  Raghu V

గత సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శతమానంభవతి’ చిత్రం ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఖైదీ నెం.150’ మరియు ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రాల జోరును తట్టుకుని శతమానంభవతి భారీ వసూళ్లను సాధించింది. ఆ సంవత్సరంలో చిన్న చిత్రాల్లో పెద్ద విజయంగా ఆ సినిమా నిలిచింది. దాంతో పాటు ఆ సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అవార్డు కూడా దక్కింది. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన సినిమా అంటూ ప్రముఖులు ప్రశంసించారు. అంతటి విజయాన్ని దక్కించుకున్న దర్శకుడు సతీష్‌ వేగేశ్న ప్రస్తుతం ‘శ్రీనివాస కళ్యాణం’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

‘శతమానంభవతి’ చిత్రం తర్వాత సతీష్‌ దర్శకత్వంలో వస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. మొదట ఈ చిత్రాన్ని ఎన్టీఆర్‌తో తెరకెక్కించాలని ఆయన భావించాడు. దిల్‌రాజు కూడా ఎన్టీఆర్‌ డేట్ల కోసం ప్రయత్నాలు చేశాడు. కాని ఎన్టీఆర్‌ ఈ సినిమాపై ఆసక్తి చూపించలేదు. దాంతో ఎన్టీఆర్‌ స్థానంలో నితిన్‌ను దర్శకుడు సతీష్‌ ఎంపిక చేయడం జరిగింది. నితిన్‌, రాశిఖన్నా జంటగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్‌లో విడుదల చేయాలని భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఆగస్టుకు వాయిదా వేశారు. సినిమా అనుకున్నట్లుగా రాకపోవడంతో షూటింగ్‌ కాస్త ఆలస్యం అవుతున్నట్లుగా చెబుతున్నారు.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం దిల్‌రాజు ఈ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. ప్రతి సీన్‌ కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నాడు. అందుకే ఇప్పటికే షూట్‌ పూర్తి అయిన కొన్ని సీన్స్‌ అంతగా దిల్‌రాజును మెప్పించలేక పోయాయి. దాంతో ఆ సీన్స్‌ను మళ్లీ రీషూట్‌ చేయాలనే నిర్ణయించుకున్నాడు. అందుకోసం స్క్రిప్ట్‌ను మార్చి చిన్న చిన్న మార్పులతో ఆ సీన్స్‌ను రీ షూట్‌ చేసేందుకు దర్శకుడు ప్లాన్‌ చేశాడు. అందుకే సినిమా విడుదల ఆలస్యం అవుతుంది.

రీ షూట్‌ అనేది ఎక్కువ సార్లు సినిమా ఫలితంపై దెబ్బ కొడుతుందనే విషయం తెల్సిందే. అతి తక్కువ సినిమాలు మాత్రమే రీ షూట్‌ జరుపుకుని కూడా సక్సెస్‌ను సాధించాయి. మరి ఈ చిత్రం రీ షూట్‌ సినిమాకు హెల్ప్‌ అయ్యేనా మైనస్‌ అయ్యేనా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది. అయితే రీ షూట్‌ అనగానే ఈ చిత్రంపై ఇన్నాళ్లుగా అంచనాలు పెట్టుకుని ఉన్న ప్రేక్షకులు ఉసూరుమంటున్నారు. శతమానం స్థాయిలో ఈ సినిమా ఉండదని అప్పుడే ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు ఒక అంచనాకు వచ్చేశారు.