‘విజేత’ను గెలుకుతున్న అల్లు అరవింద్‌?       2018-06-01   00:50:03  IST  Raghu V

మెగాస్టార్‌ చిన్న కూతురు శ్రీజ భర్త కళ్యాణ్‌ హీరోగా ఒక చిత్రం తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. హీరోగా పరిచయం కావాలనే ఉద్దేశ్యంతోనే చిరంజీవికి కళ్యాణ్‌ అల్లుడు అయ్యాడు అనే టాక్‌ వినిపిస్తుంది. తన అల్లుడి కోరికను సునాయాసంగానే చిరంజీవి తీర్చేశాడు. రాకేష్‌ శశి దర్శకత్వంలో కళ్యాణ్‌ హీరోగా ‘విజేత’ అనే చిత్రం తెరకెక్కుతుంది. చిరంజీవి అల్లుడు అనగానే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వస్తున్నాయి. అయితే ఆ స్థాయిలో సినిమా లేదని, ఇటీవల రషెష్‌ చూసిన కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. దాంతో అల్లు అరవింద్‌ను చిరంజీవి రంగంలోకి దించినట్లుగా ప్రచారం జరుగుతుంది.

‘విజేత’ రషెష్‌ చూసిన అల్లు అరవింద్‌ కొన్ని ముఖ్య సీన్స్‌కు రీ షూట్‌ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. రెండు వారాల పాటు ఆ రీ షూట్‌ కార్యక్రమాలు జరిగాయి. అలాగే ఒక పాట పూర్తిగా రీ షూట్‌ చేయబోతున్నారు. పాట నేపథ్యంకు, అది తీసిన లొకేషన్స్‌కు ఏమాత్రం సెట్‌ కాలేదని, మరోసారి సినిమాలోని ఆ పాటను తీయాలని అల్లు అరవింద్‌ ఆదేశించాడు. దాంతో ప్రస్తుతం ఆ పనిలో దర్శకుడు శశి ఉన్నాడు. అంతా పూర్తి అయ్యి, డబ్బింగ్‌ కూడా మొదలు పెట్టిన సమయంలో ఇలా రీ షూట్‌ల పేరుతో విసిగిస్తున్నారు అంటూ మెగా ఫ్యామిలీపై సన్నిహితుల వద్ద రాకేష్‌ శశి ఆవేదన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.

మెగా ఫ్యామిలీ నుండి ఏ హీరో సినిమా వస్తున్నా కూడా ఇలాంటివి జరగడం చాలా కామన్‌. ఇక ముఖ్యంగా చిరంజీవి చిన్నల్లుడి సినిమా అవ్వడంతో పాటు, ఆయన మొదటి సినిమా అవ్వడం వల్ల మరింతగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కళ్యాణ్‌కు మొదటి సినిమాతోనే మంచి సక్సెస్‌ను ఇవ్వాలనే ఉద్దేశ్యంతో అల్లు అరవింద్‌ రంగంలోకి దిగాడు. త్వరలోనే ఈ చిత్రంకు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసి, మిగిలి ఉన్న పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను పూర్తి చేయబోతున్నారు.

కళ్యాణ్‌ హీరోగా సక్సెస్‌ అయితే మెగా ఫ్యామిలీకి టాలీవుడ్‌లో మరింత తిరుగులేకుండా పోతుంది. అయితే కళ్యాణ్‌ తన బావమర్ది రామ్‌ చరణ్‌ మాదిరిగా సక్సెస్‌ అవుతాడా లేదంటే అల్లు శిరీష్‌ మాదిరిగా ఒక సోసో హీరోగానే మిగిలి పోతాడా అనేది చూడాలి. మొదటి సినిమా సక్సెస్‌ అయితే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. మెగా ఫ్యాన్స్‌ మాత్రం కళ్యాణ్‌పై చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారు. పవన్‌ కళ్యాణ్‌ పేరు కలిసే విధంగా ఉండటం ఈయనకు కలిసి వచ్చే అంశం అంటున్నారు.