వరుణ్‌ తేజ్‌ కూడా.. నేనేమైనా తక్కువోడినా?       2018-06-06   01:17:59  IST  Raghu V

తెలుగు హీరోలు ప్రస్తుతం రెండు చేతులతో సంపాదించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సీనియర్‌ హీరోలతో పోల్చితే ప్రస్తుత హీరోలు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు. సక్సెస్‌ ఉండేది ఎంతకాలమే, హీరోగా నిలిచేది ఎన్నేళ్లో తెలియదు కనుక, క్రేజ్‌ ఉన్నప్పుడే దాన్ని వాడేసి ఫుల్‌గా సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. అందుకోసమే వచ్చిన ప్రతి అవకాశంను వదులుకోకుండా సినిమాలు చేయడంతో పాటు, పారితోషికం విషయంలో పకడ్బందీగా ఉంటున్నారు. ఇక ఈతరం హీరోలు సినిమాలతో పాటు బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించడం చేస్తున్నారు.

టాలీవుడ్‌ హీరోల్లో మహేష్‌బాబు అత్యధికంగా కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. గతంలో ఈయన ఇంకా ఎక్కువ సంఖ్య బ్రాండ్స్‌కు ప్రమోషన్‌ చేశాడు. ప్రస్తుతం కాస్త తగ్గించాడు, కాని పారితోషికంను మాత్రం పెంచాడు. సినిమాల ద్వారా కాకుండా అత్యధిక ఆదాయంను పొందుతున్న హీరోల్లో మహేష్‌బాబు ముందు ఉన్నాడు. మహేష్‌బాబు దారిలోనే పలువురు హీరోలు కూడా తమ స్థాయికి తగ్గట్లుగా బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా మెగా హీరో రామ్‌ చరణ్‌ కూడా ఒక ప్రముఖ మొబైల్‌ స్టోర్‌కు ప్రచారకర్తగా ఎంపిక అయ్యాడు.

మెగా హీరోలు నిన్న మొన్నటి వరకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేసేందుకు ఆసక్తి చూపించేవారు కాదు. కాని ప్రస్తుతం మారిపోతున్న పరిస్థితులకు అనుగుణంగా వారు మారాలని నిర్ణయించుకున్నారు. అందుకే పలు కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు మెగా హీరోలు సిద్దం అవుతున్నారు.

తాజాగా మెగా బ్రదర్‌ నాగబాబు తనయుడు వరుణ్‌ తేజ్‌ కూడా ఒక ప్రముఖ వస్త్ర దుఖాణంకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపిక అయ్యాడు. యువ హీరోలు అఖిల్‌, నాగచైతన్య వంటి వారు బ్రాండ్స్‌తో అల్లాడిస్తుంటే తాను మాత్రం ఎందుకు ఊరికే ఉండాలనుకున్నాడో ఏమో కాని వరుణ్‌ తేజ్‌ కూడా మొదలు పెట్టాడు.

వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో మొదటిది సంకల్ప్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అంతరిక్షం’. ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. అంతరిక్షం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. విభిన్న నేపథ్యంలో సినిమా తీస్తున్న సంకల్ప్‌ రెడ్డి గతంలో ఘాజీ చిత్రాన్ని చేసిన విషయం తెల్సిందే. అంతరిక్షం కాకుండా వరుణ్‌ తేజ్‌ ‘ఎఫ్‌2’ అనే చిత్రాన్ని కూడా చేస్తున్నాడు. అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఎఫ్‌2 చిత్రంలో వెంకీతో కలిసి వరుణ్‌ స్క్రీన్‌ షేర్‌ చేసుకోబోతున్నాడు.