రైతులకు 'సిరి' ... బాబు ముందు చూపు ఇదేమరి !     2018-05-16   07:32:42  IST  Bhanu C

రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది అని తరుచూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతుంటారు. అంతే కాదు రైతుల సంక్షేమమే తన లక్ష్యం అని చెప్తూ వారికి ఎన్నో రాయితీలతో కూడిన పథకాలు ప్రవేశపెట్టారు. తాను కూడా చాలా సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని అని గర్వంగా చెప్పుకుంటారు. తాజాగా ఆయన రైతులకోసం కొత్తగా ఓ పధకాన్ని ప్రవేశపెట్టి వారి మనస్సులో సుస్థిర స్థానం సంపాదించుకోబోతున్నారు.

రైతులకు ఉచితంగా విధ్యుత్ పొందేలానే కాకుండా దాని ద్వారా వారు ఆదాయం పొందేందుకు అలాగే వ్యవసాయాన్ని లాభదాయకం చేసేందుకు గ్రిడ్‌ అనుసంధానిత సౌర పంపుసెట్లు అందించే విధంగా సౌర సిరి పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సౌర పంపుసెట్లతో రైతులు పంటల సాగుకు ఉచితంగా విద్యుత్‌ను వాడుకోవడమే కాకుండా మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా ఏడాదికి 5 నుంచి 10 వేల రూపాయలు పొందేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నారు. . రైతులు ఏడాదిలో 200 రోజులు సౌర పంపుసెట్లను వినియోగించుకున్నా… మిగిలిన 165 రోజులూ గ్రిడ్‌కు విద్యుత్‌ను విక్రయించుకోవచ్చు. ఈ పథకాన్ని తొలుత పైలట్‌ ప్రాజెక్టుగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.