మామ ఓ పార్టీలో.... అల్లుడు ఓ పార్టీలోనా..       2018-05-27   01:50:08  IST  Bhanu C

మామ ఒక పార్టీలో.. అల్లుడు మ‌రో పార్టీలో.. ఇప్పుడు తెలంగాణ‌లో ఈ ప‌రిణామాల‌పై ఆసక్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఇంత‌కీ ఎవ‌రా మామా, ఎవ‌రా అల్లుడు అని ఆలోచిస్తున్నారా..? అయితే వారెవ‌రే కాదు… ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా పాల‌కుర్తి టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు, ఆయ‌న అల్లుడు మెద‌క్ జిల్లాకు చెందిన మ‌ద‌న్‌మోహ‌న్‌రావు. తాజాగా.. మ‌ద‌న్‌మోహ‌న్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరి, మామ ఎర్రబెల్లికి షాక్ ఇచ్చారు. నిన్న టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు ఒంటేరు ప్ర‌తాప్‌రెడ్డి, మ‌ద‌న్‌మోహ‌న్‌రావు ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ స‌మక్షంలో చేరారు. దీంతో మామ టీఆర్ఎస్‌లో.. అల్లుడు కాంగ్రెస్‌లో ఉన్నారంటూ చ‌ర్చ‌జ‌రుగుతోంది.

నిజానికి గ‌త ఎన్నిక‌ల్లో మెద‌క్ జిల్లా గ‌జ్వేల్‌లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై ఒంటేరు ప్ర‌తాప్‌రెడ్డి పోటీ చేసి ఓడిపోయిన విష‌యం తెలిసిందే. ఇక జ‌హీరాబాద్ నుంచి మ‌ద‌న్‌మోహ‌న్‌రావు ఎంపీగా బ‌రిలోకి దిగి ఓడిపోయారు. నిజానికి మ‌ద‌న్‌మోహ‌న్‌రావు టీఆర్ఎస్‌లో చేరేందుకు ఆస‌క్తి చూపారు. కానీ, మంత్రి కేటీఆర్ ఏదైనా హామీ ఇవ్వ‌క‌పోవ‌డ‌మేకాదు.. పెద్ద‌గా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో హ‌ర్ట్ అయిన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నార‌నే టాక్ వినిపిస్తోంది. అంతేగాకుండా.. ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు వారించినా.. ఆయ‌న విన‌లేద‌ని తెలిసింది.

వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ జ‌హీరాబాద్ పార్ల‌మెంటు స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆయ‌న‌కు రాహుల్ హామీ ఇచ్చిన‌ట్లు తెలిసింది. ఇదిలా ఉండ‌గా.. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కుంతియా, షబ్బీర్‌ అలీ, సునీతా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ప్ర‌తాప్‌రెడ్డి, మ‌ద‌న్‌మోహ‌న్‌నావు చేర‌డంతో మెద‌క్‌లో పార్టీ మ‌రింత బ‌లోపేతం అవుతుంద‌నే ఆ పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. ఆర్థికంగా బ‌ల‌మైన అభ్య‌ర్థిగా మ‌ద‌న్ త‌న స‌త్తాచాటుతార‌నే ప‌లువురు నాయ‌కులు అంటున్నారు.

టీఆర్ఎస్‌ నేతల బెదిరింపులు, ప్రలోభాలకు లొంగకుండా నీతి, నిజాయతీ ఉన్న కాంగ్రెస్‌లో తాను చేరినట్టు ఒంటేరు ప్ర‌క‌టించారు. 2019లో గజ్వేల్‌ నుంచి పోటీచేసి గెలిచి కాంగ్రెస్‌ పార్టీకి బహుమతిగా ఇస్తానని ఆయ‌న‌ ప్రకటించారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీలో తమ స్వగ్రామానికి చెందిన విద్యార్థి చ‌నిపోతే పరామర్శకు వెళ్లిన తనను ప్రభుత్వం నెల రోజులపాటు జైలుపాలు చేసిందని ప్రతాప్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.