‘మహానటి’, అశ్వినీదత్‌పై జక్కన్న షాకింగ్‌ వ్యాఖ్యలు       2018-05-14   21:38:14  IST  Raghu V

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు మినహా ఇతర సమయాల్లో కొత్త సినిమా విడుదల అవుతుంది అంటే మొదటి రోజే చూడాల్సిందే. స్టార్‌ హీరోల సినిమాలపై ఆయన ఎక్కువగా ఆసక్తి కనబర్చుతూ ఉంటాడు. రాజమౌళి మొదటి రోజు సినిమా చూశాడు అంటే తన స్పందనను ఖచ్చితంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తాడు. తాజాగా మహానటి చిత్రాన్ని చూసిన రాజమౌళి ఒక అద్బుతం అంటూ తన అభిప్రాయంను వ్యక్తం చేశాడు. ఇలాంటి సినిమా చేసిన వారికి, తీసిన వారికి శుభాకాంక్షలు అంటూ జక్కన్న అభినందనలు తెలియజేశాడు. కీర్తి సురేష్‌ నటనపై ట్విట్టర్‌లో ప్రశంసల జల్లు కురిపించాడు.

తాజాగా మహానటి చిత్ర యూనిట్‌ సభ్యులకు అల్లు అరవింద్‌ సన్మానం చేశారు. ఆ సందర్బంగా రాజమౌళిని కూడా ఆహ్వానించారు. రాజమౌళి చేతుల మీదుగా మహానటి యూనిట్‌ సభ్యులను సన్మానించారు. ఆ సమయంలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సీనీ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. సోషల్‌ మీడియాలో ఆ వార్తలు వైరల్‌ అయ్యాయి. ఇంతకు ఆ వ్యాఖ్యలు ఏంటీ అంటే.. మహానటి సినిమాను తీస్తున్నారని ప్రకటించినప్పుడు పెద్దగా ఆసక్తి అనిపించలేదు. ఆ స్థాయిలో సినిమాను తీస్తారా అనుకున్నాను. సినిమా వారం రోజుల్లో విడుదల అవ్వబోతుంది అనే వరకు నేను ఆ సినిమా చూడాలని భావించలేదు. కాని కుటుంబ సభ్యులు సినిమా గురించి పదే పదే చెబుతుండటంతో పాటు, వారు టికెట్లు బుక్‌ చేయడంతో సినిమా చూసేందుకు వెళ్లాను.

సినిమాకు వెళ్లే సమయంలో కూడా తాను పెద్దగా అంచనాలు పెట్టుకుని వెళ్లలేదు. కాని సినిమా ప్రారంభం అయ్యాక మొదటి సీన్‌ నుండి చివరి సీన్‌ వరకు అన్ని సీన్స్‌ కూడా నాకు బాగా కనెక్ట్‌ అయ్యాయి. ప్రతి సీన్‌ కూడా నాకు అద్బుతంగా అనిపించిందని జక్కన్న చెప్పుకొచ్చాడు. అందుకే చిత్ర యూనిట్‌ సభ్యులకు సన్మానం అనగానే వచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు.

అల్లు అరవింద్‌ గారు ‘మహానటి’ సక్సెస్‌ నేపథ్యంలో అశ్వినీదత్‌ గారికి సన్మానం చేస్తున్నాం మీరు రావాలి అంటూ ఫోన్‌ చేసినప్పుడు నేను సినిమా తీసింది ఆయన పిల్లలు అయితే ఆయన్ను ఎందుకు సన్మానించాలని అనుకున్నాను. ఆయన పిల్లలు ఎంతో కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించారు. అందుకే వారికే ఈ క్రెడిట్‌, సన్మానం దక్కుతుంది. అయితే అంతటి గొప్ప పిల్లలను కన్నందుకు దత్‌ గారిని కూడా ఖచ్చితంగా సన్మానించాల్సిందే అంటూ తనదైన శైలిలో అందరిని ఆకట్టుకునేలా రాజమౌళి మాట్లాడాడు. మొత్తానికి రాజమౌళి మాటల్లో మహానటి ఆయన్ను విపరీతంగా ఆకట్టుకుందనే విషయం వెళ్లడవుతుంది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప దర్శకుడు అయిన రాజమౌళి ప్రశంసలు అందుకోవడంతో మహానటి యూనిట్‌ సభ్యులు ఉబ్బి తబ్బిబవుతున్నారు.