‘మహానటి’పై అలిగిన సంజయ్‌ కిషోర్‌       2018-05-26   06:36:46  IST  Raghu V

తెలుగు ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్న ‘మహానటి’ చిత్రంపై మొన్నటి వరకు జెమిని గణేషన్‌ కూతురు కమలా మాత్రమే విమర్శలు చేశారు. సినిమాలో తన తండ్రిని తప్పుగా చూపించారు అని, ఆయన గొప్ప నటుడు అనే విషయాన్ని చిత్రంలో చూపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మరో వ్యక్తి కూడా ‘మహానటి’ చిత్రంపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మహానటి చిత్రంపై అనే కంటే మహానటి దర్శకుడిపై అనడం బెటర్‌. ఎందుకంటే ఆయన్ను మహానటి దర్శకుడు గౌరవించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆయన మరెవ్వరో కాదు సావిత్రి గారికి వీరాభిమాని అయిన సంజయ్‌ కిషోర్‌.

సావిత్రి గారు జీవించి ఉన్నప్పటి నుండి ఆమెకు సంబంధించిన అనే విషయాలను, వివరాలను సంజయ్‌ కిషోర్‌ కలెక్ట్‌ చేసి పెట్టుకున్నాడు. సావిత్రి గారి గురించి ఎందరో ఎన్నో పుస్తకాలను రాశారు. వారంతా కూడా సంజయ్‌ కిషోర్‌ నుండి ఎన్నో విషయాలను తెలుసుకున్నారు. ఆయన చెప్పిన విషయాలను పుస్తక రూపంలోకి తీసుకు వచ్చారు. మహానటి చిత్రం అనుకున్నప్పుడు నాగ్‌ అశ్విన్‌కు కూడా పలువురు సంజయ్‌ కిషోర్‌ను సంప్రదించాలని సలహా ఇచ్చారట. సంజయ్‌ కిషోర్‌ను మూడు నాలుగు సార్లు నాగ్‌ అశ్విన్‌ తన టీంతో కలవడం జరిగింది. ఆ సమయంలో సంజయ్‌ కిషోర్‌ తన వద్ద ఉన్న పలు ఇన్‌పుట్స్‌ను ఇచ్చాడట.

తాజాగా సంజయ్‌ కిషోర్‌ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను నాగ్‌ అశ్విన్‌కు చాలా కీలకమైన సమాచారంను ఇచ్చాను. ఆయన నా వద్ద నుండి చాలా ఇన్స్‌పుట్స్‌ను తీసుకున్నారు. కాని నాకు అందుకు తగ్గ గౌరవం మాత్రం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అమ్మగారి గురించి సినిమా అంటే చాలా సంతోషించాను. ఆమె గురించి తెలుగు వారికి తెలియాల్సిన విషయాు చాలా ఉన్నాయని, అవన్ని నాగ్‌ అశ్విన్‌ చూపిస్తాడని సంతోషించాను. నా వద్ద ఉన్న పలు విషయాలను చెప్పాను. కాని నాగ్‌ అశ్విన్‌ ఆ విషయాన్ని మర్చిపోయినట్లున్నాడు. టైటిల్స్‌లో కనీసం థ్యాంక్స్‌ కార్డ్‌ వేసినా సంతోషించేవాడిని. ఆర్థికంగా నేను ఏమీ ఆశించలేదు, కాని టైటిల్స్‌లో థ్యాంక్స్‌ కార్డ్‌ను కోరుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ విషయమై చిత్ర యూనిట్‌ సభ్యులు ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి. ఒక భారీ చిత్రాన్ని చేసినప్పుడు ఇలాంటి చిన్న చిన్న సంఘటలను జరుగుతూనే ఉంటాయి. కొందరి పేర్లు మర్చి పోతూ ఉంటారు. అలాగే సంజయ్‌ కిషోర్‌ను కూడా దర్శకుడు మర్చి పోయి ఉంటాడేమో అంటూ కొందరు సినీ వర్గాల వారు అంటున్నారు. సంజయ్‌ కిషోర్‌కు ఇప్పటికైనా మీడియా ముఖంగా లేదా, వ్యక్తిగతంగా అయినా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ కృతజ్ఞతలు చెప్పడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మరి నాగ్‌ అశ్విన్‌ ఎలా రియాక్ట్‌ అవుతాడో చూడాలి.