యాదాద్రి జిల్లా:యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేలువర్తి గ్రామానికి చెందిన యువకుడు మనస్తాపంతో పురుగుల మందు తాగి మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే…వేలువర్తి గ్రామంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన వార్డు మెంబర్ భీమగాని వేంకటేశం అక్రమ బెల్టు షాపు నిర్వహిస్తున్నారు.
అయితే కొన్ని రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన హరిప్రసాద్ (22) మద్యం సేవించడానికి బెల్టు షాపుకు వెళ్ళగా అతడు దొంగతనం చేశాడనే నెపంతో భీమగాని వెంకటేశం,అతని భార్య దారుణంగా దాడి చేయడంతో మనస్తాపనికి గురైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.అతడిని హుటాహుటిన హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చేరిపించగా యువకుడు చికిత్స పొందుతూ గురువారం రోజు మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ సంఘటనకు కారణమైన అధికార పార్టీకి చెందిన వార్డు మెంబర్ ప్రస్తుతం పరారిలో ఉన్నాడు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే గ్రామంలో యథేచ్ఛగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నా సంబంధిత అధికారులు ఎటువంటి చర్యలు లేకుండా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.తమ కొడుకు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చెయ్యాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.