బాబోయ్ బాబు ! మోదీని అనవసరంగా కెలుకుతున్నాడా ..?       2018-06-07   02:31:35  IST  Bhanu C

నోటితో నవ్వి నొసటితో వెక్కిరించుకోవడం రాజకీయాల్లో మాములే. రాజకీయ స్నేహాలు ఎలా ఉంటాయంటే అవసరం ఉన్నంతవరకు భుజం భుజం రాసుకు తిరుగుతారు.. అవసరం లేదనుకుంటే ఆ భుజాలనే నరకాలని చూస్తారు. ఇవన్నీ రాజకీయాల్లో షరా మామూలు వ్యవహారాలే ! సరిగ్గా ఇలాంటి పనే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్ర్య్ చంద్రబాబు కూడా చేస్తున్నట్టు కనిపిస్తోంది. నాలుగేళ్లపాటు బీజేపీతో చెట్టపట్టాలు వేసుకుని తిరిగి .. వారు ఏది చెప్తే అదే వేదం అన్నట్టు వ్యవహరించాడు. ఆఖరికి ఏపీకి హోదా ఇవ్వం .. ప్యాకేజ్ ఇస్తాం అని కేంద్రం చెప్తే దానికి కూడా తల ఊపిన చంద్రబాబు బీజేపీతో క్రమక్రమంగా దూరం పెరగడంతో దోస్తీకి కటీఫ్ చెప్పేసాడు.

బీజేపీతో స్నేహం ఉన్న నాలుగు సంవత్సరాలు ఒక్కమాట కూడా అనకుండా ఇప్పుడు తీవ్ర స్థాయిలో బీజేపీపై ఎదురు దాడి చేస్తున్నాడు. ఆయన విమర్శలు ఈ మధ్యన శృతి మించినట్లుగా కనిపిస్తోంది. అవసరం ఉన్నా.. లేకున్నా.. ఏదోలా మోడీషాలను కెలకటమే తన లక్ష్యమన్నట్లు ఆయన వ్యవహరిస్తున్నారు. రాజకీయ దూషణలు కాస్తా.. వ్యక్తిగత స్థాయికి పడిపోవటం చూసినప్పుడు బాబు అనవసరంగా మోదీతో పెట్టుకుంటున్నాడా అనే సందేహం కలుగుతోంది.

ఇక నరేంద్రమోదీ విషయానికి వస్తే… పార్టీలో తన వర్గాన్ని తప్ప మిగిలిన వారిని పట్టించుకోవటం మానేశారు. బీజేపీ సీనియర్ నేతల మాటల్ని వినేందుకు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. ఆ మాటకు వస్తే.. వారిని చూసేందుకే కాదు.. కలిసేందుకు సైతం ఇష్టపడటం లేదు. ఆ మధ్యన బీజేపీ పెద్దాయన అద్వానీ ముకుళిత హస్తాలతో నమస్కారం చేస్తే.. ఆ వైపు చూసేందుకు సైతం మోడీ ఆసక్తి చూపించకపోవటం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ వ్యాసావహారం మోదీ ఇమేజ్ ను బాగా డ్యామేజ్ చేసింది.

ఉప ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పార్టీకి భారీగా ఎదురుదెబ్బ తగలటంతో మోదీ , అమిత్ షా లు కిందకు దిగివచ్చారు. అప్పటివరకూ అందరిని కలుపుకు వెళ్లే విషయంలో తమ సొంత ఎజెండా ఫాలో అవుతున్న మోడీ.. తన ప్లాన్ ను మార్చేసినట్లుగా కనిపిస్తోంది. ఇంతకాలం పెద్దగా పట్టని బీజేపీ పెద్దల్ని ఇప్పుడు పట్టించుకోవటమే కాదు ఇక పార్టీకి మీరే దిక్కు అన్నట్టు వ్యవహరిస్తున్నాడు. ఇదంతా బీజేపీ పర్సనల్ విషయం.

కానీ ఈ అంశాలను కూడా బాబు ఎత్తిచూపుతూ వారిని అవహేళన చేస్తున్నట్టు కనిపిస్తోంది.
మొన్నటి వరకూ ఆకాశంలో విహరించిన మోడీ.. ఉప ఎన్నికల ఫలితాలతో నేలకు దిగి వచ్చారని బాబు మండిపడుతున్నారు. ఉప ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా భయపడిన మోడీ.. అద్వానీ.. జోషీ లాంటి సీనియర్ల వద్దకు వెళ్లి అడుక్కునే పరిస్థితికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు.

ఒక వేళా మోదీ కాలం కలిసి వచ్చి మళ్ళీ అధికారంలోకి వస్తే చంద్రబాబు పరిస్థితి ఏంటి..?
ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులోనూ అందుకు తగ్గ ఫలితం అనుభవించాల్సి ఉంటుందన్న నిజాన్ని బాబు గుర్తిస్తే మంచిదంటున్నారు. సున్నితమైన అంశాల్ని టచ్ చేసేటప్పుడు ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించాలే కానీ.. బజారున పడ్డట్లుగా వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తుందని చంద్రబాబు గుర్తుంచుకుంటే మంచిది. లేకపోతే కోరి కష్టాలను తెచ్చుకున్నట్టే.