బస్తీమే సవాల్ ! పార్టీల మధ్య ముదిరిన ఛాలెంజ్ లు       2018-06-08   03:50:42  IST  Bhanu C

ఏయ్ నువ్వెంత .. కాదు నువ్వెంత. మీ అవినీతి చిట్టా నా దగ్గర ఉంది.. ఆహా మీ అవినీతి చిట్టా కూడా మా దగ్గర ఉంది జాగ్రత్త అంటూ ఇప్పుడు ఒకరికొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. రాజకీయాలు అంటే అంతే మరి. బాగున్నంతసేపు అంతా బాగున్నట్టే కనిపిస్తారు. విడిపోయాక ఒకరి గొయ్య ఇంకొకరు తవ్వాలని చూస్తుంటారు.ఇందులో విలువలు అనే పదానికి అర్ధమే ఉండదు. అంతా స్వప్రయోజనమే. దీనికి ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడానే లేదు. అన్ని ఒకే గొడుగు కిందకు వస్తాయి.

మీరు అవినీతిలో మునిగిపోయావని ఒక పార్టీ అంటే, కొన్నాళ్లు ఆగూ, నీ బండారం బయటపడే స్కామ్‌లు వెలికితీస్తానని ఇంకో పార్టీ ఛాలెంజ్ విసురుతుంది. ఇలా ఇప్పుడు ఛాలంజ్ లు విసురుకునే పార్టీలు ఏవైనా ఉన్నాయా అంటే… ఆ రెండు పార్టీలు, టీడీపీ-బీజేపీ. ఎయిర్‌ ఏషియా ముడుపుల బాగోతంలో చంద్రబాబు పాత్ర ఉందని బీజేపీ వేలెత్తుతుంటే, కొన్నాళ్లలో ఏకంగా మోడీ కేంద్రంగా స్కామ్‌లే బయటపెడతానని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సవాల్‌ విసిరారు.

ఒకరి గురించి ఒకరు, ఒకరి తప్పిదాల గురించి మరొకరు, తిట్టిన తిట్టు తిట్టకుండా, చేసిన ఆరోపణ చేయకుండా, రకరకాల అవినీతి ఆరోపణలు సంధించుకుంటూ, రచ్చరచ్చ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎయిర్‌ ఏషియా ఎక్కి, టీడీపీ మీద బీజేపీ సవారి చేస్తుంటే, రానున్న రోజుల్లో కాషాయం స్కామ్‌ల బయటపెట్టి, స్వారీ చేస్తానంటోంది తెలుగుదేశం. మీకు సంబంధించి రెండు స్కామ్ ల వివరాలు మా చేతిలో ఉన్నాయి జాగ్రత్త అంటూ టీడీపీ సవాల్ విసురుతోంది.

స్కామ్‌లు చంద్రబాబుకు అలవాటైపోయిందని బీజేపీ అంటే, నెలలో మోడీ చేసిన అవినీతి బయటపెడతానని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సంచలన సవాల్ విసిరారు. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్టుగా ఎయిర్‌ ఏషియా కుంభకోణంలో కొన్ని ఆడియో టేపులు బయటకు రాగానే, టీడీపీ నాయకులు భుజాలు తడుముకుంటున్నారని బీజేపీ నాయకుడు జీవీఎల్‌ వ్యాఖ్యానించారు. ఇలా ఎవరికీ వారు ఒకరి తప్పులు ఒకరు ఎట్టి చూపుకుంటూ రాజకీయాల్లో ఉన్న ఏ పార్టీ అవినీతికి అతీతం కాదనే నిజాన్ని ప్రజలకు బాగా వివరించడంతో పాటు చక్కని వినోదాన్ని పంచుతున్నారు.