పోరాటం లేదు ఆరాటమే ... క్రెడిట్ కబ్జా చేస్తున్న జనసేనాని !       2018-06-02   00:43:32  IST  Bhanu C

కబ్జాలందు రాజకీయ కబ్జాలు వేరయా అని నిరూపిస్తున్నాడు కొత్తగా రాజకీయ అరంగ్రేటం చేసిన జనసేనాని. ఏదైనా అంశం మీద ఎవరో పోరాటం చేస్తే వచ్చిన క్రెడిట్ నాదే అని చెప్పుకుంటూ ప్రజల్లో మార్కులు కొట్టేయాలని తెగ తాపత్రయపడిపోతున్నాడు. నాలుగేళ్ల పాటు ఏపీ, కేంద్రప్రభుత్వాల మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా సైలెంట్ గా ఉన్న పవన్ … ఇప్పుడు ప్రభుత్వాన్ని ఎత్తి చూపుతూ … వచ్చిన క్రెడిట్ తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ముఖ్యంగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటం ద్వారా వచ్చిన ప్రతిఫలాన్ని పవన్ కొట్టేయాలని చూస్తున్నాడు.

ప్రత్యేక హోదా ఉద్యమం మీద మొదటి నుంచి గొంతెత్తి పోరాడిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అది వైఎస్ జగన్ అని తడుముకోకుండా చెప్తారు ఎవరైన. ఈ నాలుగేళ్లుగా అదే అంశం మీద అలుపెరగకుండా పోరాడుతూ .. ఢిల్లీకి రైలు యాత్ర తో సహా అన్ని చేసింది ఒక్క జగన్ పార్టీనే. ఆఖరికి హోదా కోసం పార్టీ ఎంపీలచే రాజీనామా చేయించి తన నిబద్ధతను చాటుకున్నాడు జగన్. కానీ పవన్ ఇప్పుడొచ్చి హోదా ఉద్యమం మీద పేటెంట్ నాదే అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇన్ని సంవత్సరాలు బీజేపీతో అంటకాగిన పవన్ ఈ ఉద్యమం మీద గొంతెత్తింది లేదు. కేవలం మొక్కుబడిగా ట్విట్టర్ లో రెండు మూడు సార్లు ట్విట్లు పెట్టి ఊరుకున్నాడు. కానీ ఇప్పుడు ప్రజల్లో తిరుగుతూ ఈ డిమాండ్ అసలు మొదలుపెట్టిందే నేను అంటూ గొప్పలు చెప్తున్నాడు.

పవన్ తన పాదయాత్రలో జగన్, బాబు ఇచ్చిన హామీలు -చేసిన మోసాలు అని ఒక్కోటీ జనాల్లో మారుమోగేలా పూసగుచ్చినట్టు వివరిస్తున్నారు. వీటిలో నిరుద్యోగ భృతి బాగా వైరల్ అయింది. దీంతో చంద్రబాబు టీం పదే పదే మీడియా ముందుకు వచ్చి మేం 98 శాతం హామీలు నెరవేర్చాం అని చెబుతున్నారు. వైసీపీ సాధించిన నిరుద్యోగ భృతి మంజూరు విజయాన్ని కూడా జనసేన తన అక్కౌంట్లో వేసేసుకుంది. జనసేనకు యువతలో పెరుగుతున్న మద్దతు చూసి నిరుద్యోగ భృతి టీడీపీ ప్రవేశపెట్టిందని పవన్ చెప్తున్నాడు.

ఈ మధ్య బాగా పాపులర్ అయినా ఒక ఇష్యూ చూసుకుంటే… చెరుకు రసం కలర్ లో ఉన్న మంచి నీళ్లను చూపిస్తూ *చంద్రబాబూ ఇది చెరుకు రసం కాదు – మీ ప్రభుత్వం జనాలకు ఇస్తున్న మంచినీళ్లు* అంటూ బాటిల్ చూపిస్తూ జగన్ చేసిన ప్రసంగం ఇటీవల ఏపీ సర్కారు గాలి తీసింది. జగన్ ఆ ప్రసంగం బాగా హిట్టవడంతో అదే సీన్ జనసేన పోరాట యాత్రలో కాపీ చేసేసారు. ఇదొక్కటే కాదు.. జగన్ లేవనెత్తే సమస్యల్లో స్పందన వచ్చే ప్రతి విషయాన్ని జనసేన వారు కాపీ కొట్టేస్తున్నారు.